నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అండగా నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌ను రెండు మూడు మ్యాచ్‌లలోని ప్రదర్శన ఆధారంగా విమర్శించడం సరికాదని హితవు పలికాడు. అతడిని సరిగ్గా ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో ఒక తరం చూడని అత్యద్భుత ప్రతిభావంతుడిగా (జెనరేషనల్ టాలెంట్) ఎదిగే సత్తా ఉందని జోస్యం చెప్పాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల్లో వైభవ్ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ముఖ్యంగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బంతులకు రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. దీనిపై రజా మాట్లాడుతూ.. “15 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు, అతడిని వెంటనే విమర్శించడం అన్యాయం. వైభవ్ చుట్టూ ఎంతో మంది అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అతడిని సరిగ్గా తీర్చిదిద్దగలిగితే, వైభవ్ కచ్చితంగా ఒక జెనరేషనల్ టాలెంట్ కాగలడు. గత ఏడాది కాలంలో అతను సాధించిన ఘనతలు, అండర్-19 స్థాయిలో ప్రదర్శనలు చూస్తే అతను ఎంత ప్రత్యేకమైన ఆటగాడో అర్థమవుతుంది” అని వివరించాడు.
రేపటి నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న సిరీస్‌లో వైభవ్‌కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇదే హరారేలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ 80 బంతుల్లో 175 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించడం విశేషం.
మరోవైపు టీమిండియాతో జరగబోయే సిరీస్ ఏకపక్షంగా సాగుతుందన్న వాదనను రజా తోసిపుచ్చాడు. ఇరు జట్లకు గెలుపుపై సమాన అవకాశాలు ఉంటాయని, సిరీస్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. “జింబాబ్వే చాలా నిలకడగా, వినోదాత్మక క్రికెట్ ఆడుతోంది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే, ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను” అన్నాడు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను ఓడించిన విషయాన్ని రజా గుర్తుచేశాడు.



