Wednesday, July 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ తో యుద్ధ ఖర్చు 37.5 బిలియన్‌ డాలర్ల

ఇరాన్‌ తో యుద్ధ ఖర్చు 37.5 బిలియన్‌ డాలర్ల

- Advertisement -
  • అమెరికా రక్ష‍ణ శాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌

నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌ యుద్ధం కారణంగా అమెరికాకు ఇప్పటివరకు 37.5 బిలియన్‌ డాలర్ల (రూ. 3.62 లక్ష‍ల కోట్లు ) వ్యయమైనట్లు అమెరికా రక్ష‍ణ శాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌ మంగళవారం వెల్లడించారు. మే మధ్య కాలంలో సుమారు 29 బిలియన్‌ డాలర్ల వ్యయం అంచనా వేయగా.. ఖర్చు భారీగా పెరిగింది. ఈ రోజు వరకు 37.5 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశామని హెగ్సెత్‌ సెనెట్‌ కేటాయింపుల కమిటీకి తెలిపారు. పెంటగాన్‌ కోసం అదనపు నిధులు 67బిలియన్‌ డాలర్లు కేటాయించాలని కోరారు.

సెప్టెంబర్‌ చివరి వరకు ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించిన పెంటగాన్‌ ఖర్చులను భరించడానికి నిధులను కేటాయించడం ‘అత్యవసరం’, ‘తప్పనిసరి’ అని హెగ్సెత్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ హెగ్సెత్‌ వద్ద 75 బిలియన్‌ డాలర్ల ఖర్చు చేయని నిధులు ఉన్నాయని డెమోక్రాట్‌ సభ్యులు జీన్ షాహీన్‌ సవాలు చేశారు. ఖర్చు చేయని నిధులను సర్దుబాటు చేయడానికి బదులుగా ఎందుకు యుద్ధం ఖర్చును ప్రజలపై మోపాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఖర్చు చేయని ఆ నగదును, అధ్యక్ష‍ుడు ట్రంప్ ఇతర ప్రాధాన్యతలు ముఖ్యంగా గోల్డెన్‌ డోమ్‌ ఫర్‌ అమెరికా, హైపర్‌సోనిక్స్‌, ఇతర ఆయుధ సామాగ్రి పెట్టుబడులు వంటి ఇతర వాటి కోసం కేటాయించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక క్యాంప్‌ల పునరుద్ధరణ నిమిత్తమయ్యే ఖర్చును ఈ నిధుల్లో చేర్చలేదని అన్నారు. పశ్చిమాసియా యుద్ధంలో గెలిచేందుకు ట్రంప్‌ యంత్రాంగ వ్యూహం పూర్తి వివరాలను వెల్లడించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్ముజ్‌ జలసంధిని అమెరికా విడిచిపెడితే.. ఏం జరుగుతుందని రిపబ్లికన్ సెనెటర్‌ జాన్‌ కెనడీ ప్రశ్నించారు. జలసంధిని దాటేందుకు ఇరాన్‌ నిర్దిష్టమైన రుసుము విధిస్తుందా లేదా అన్న అంశంపై హెగ్సెత్‌, డాన్‌ కెయిన్‌లు నిర్దిష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారు. ఈ అంశంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -