Wednesday, July 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఅద్వానంగా వడ్డేపల్లి - అనాజీపూర్ రోడ్డు

అద్వానంగా వడ్డేపల్లి – అనాజీపూర్ రోడ్డు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
రోడ్డు వేయండి సారూ.. నిత్యం నరకయాతనే అంటూ రాయపోల్ మండల కేంద్రానికి కొత్తపల్లి రోడ్డుగుండా వచ్చే ప్రయాణికులు వాపోతున్నారు. రాయపోల్ మండలం వడ్డేపల్లి నుంచి రాంసాగర్, కొత్తపల్లి మీదకు అనాజీపూర్ వరకు ఈ రోడ్డు మార్గం ఉంటుంది. కానీ వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి, వీరానగర్, ముంగిస్ పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్, కొత్తపల్లి పలు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రధానంగా ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి బురదమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పై ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గ్రామస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల్లో నీరు నిలవడంతో వాటి లోతు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. వర్షం పడిన సమయంలో రోడ్డు పై ప్రయాణించడం మరింత కష్టసాధ్యంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారంగా నూతన బీటీ రోడ్డును నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో మరిన్ని ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి వడ్డేపల్లి – అనాజీపూర్ రోడ్డును అభివృద్ధి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -