– మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన వేంసూరు మండల రైతులు
– ఆగస్టు చివరికల్లా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలు
నవతెలంగాణ-సత్తుపల్లి
వర్షాభావం, సాగర్ జలాలు అందక ఎండిపోతున్న మా పంట పొలాలకు గోదావరి జనాలతో జీవం పోసి తమను ఆదుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వేంసూరు మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సత్తుపల్లిలోని కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు గృహంలో మంత్రిని కలిసిన వేంసూరు మండల రైతులు ఆత్మీయ సన్మానం చేశారు. రాజీవ్ లింకు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడటం తమ అదృష్టమని ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
రైతుల ఆనందం చూసి స్పందించిన మంత్రి తుమ్మల వారితో మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల్లో పంట మార్పిడి పద్ధతులు పాటించాలని సూచించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని పునరుద్ఘాటించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ ఎకరానికీ గోదావరి జలాలను అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆగస్టు చివరికల్లా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో గోదావరి నీటిని అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని భరోసానిచ్చారు. నీటి ఎద్దడి తీర్చిన మంత్రి సేవలను రైతాంగం కొనియాడింది. మంత్రిని కలిసిన వారిలో గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహనరావు, రాచూరి గంగరాజు, చంద్రశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.



