Homeతెలంగాణ రౌండప్గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలం-గాణ వనపర్తి
గర్భిణీల ఆరోగ్యంపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గర్భిణీలకు హెచ్‌బీ స్థాయిలను తప్పనిసరిగా పరీక్షించి, అవసరమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని (MCH) గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గర్భిణీల పరీక్షల విభాగం, ఇతర వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణీలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందులు, పరీక్షలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. గర్భిణీలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

   వైద్య అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలలో హెచ్‌బీ స్థాయిలను తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. హెచ్‌బీ స్థాయిని బట్టి అవసరమైన చికిత్స, మందులు అందించి రక్తహీనతను తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య చికిత్సను సకాలంలో అందించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ గదిని కలెక్టర్ పరిశీలించి, స్కానింగ్‌కు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్కానింగ్ వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని, అవసరమైన గర్భిణీలకు నిర్ణీత విధానాల ప్రకారం స్కానింగ్ సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రికి జ్వరం లక్షణాలతో వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జ్వరంతో వచ్చే రోగుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణకు అనుగుణంగా చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

  అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడ నీరు నిలిచిన ప్రాంతాలను గమనించారు. ఆసుపత్రి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ, పారిశుద్ధ్య చర్యలను చేపట్టడంతో పాటు దోమల వృద్ధికి అవకాశం లేకుండా చూడాలని సూచించారు.

   అదేవిధంగా వైద్య అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ సమన్వయంతో మండలాల వారీగా ఎదుగుదలలో లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ఎన్ఆర్సికి తరలించాలని వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో భాస్కర్ నాయక్, జి జి హెచ్ సూపరింటెండెంట్ చంద్రమోహన్, ఆర్ ఎం ఓ సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -