Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి

- Advertisement -

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో సీఎస్‌ సంజయ్‌ జాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎల్‌‌నినో నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను, అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నెలరోజుల్లోపు ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా రెండు జతల యూనిఫాంలను అందజేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్ ల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సీఎస్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనిఫామ్ లను కుట్టించడానికి 26 వేలమంది స్వయంసహాయక బృందాల మహిళలను గుర్తించామని అధికారులు తెలిపారు. స్కూల్ యూనిఫామ్ ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దనీ, విద్యార్థులకు అందిన స్కూల్ డ్రెస్సుల, షూస్ తదితర స్కూల్ కిట్ల నాణ్యతపై నేరుగా పాఠశాల విద్యార్థుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. సకాలంలో యూనిఫామ్ లను కుట్టించడమే లక్ష్యంగా పెట్టుకోవాలనీ, దీనిపై జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఎండీ నివేదికల ప్రకారం దేశంలోనే ఎల్ నినో ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటనీ, ఇప్పటివరకు రాష్ట్రంలో 27శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు సీఎస్‌‌కు తెలిపారు. వాతావరణ వివరాలను రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర లలో కూడా వర్షాలు ఆశాజనకంగా లేవనీ, ప్రస్తుతం మేజర్ రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటికి నిల్వ చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్‌ ‌మాట్లాడుతూ.. రైతులు వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు వరి సాగు 24 శాతం కంటే తక్కువ నమోదైందన్నారు. సెప్టెంబర్ మాసంలోనూ వర్షాలు అతి తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసిందని తెలిపారు. ప్రస్తుత సీజన్ లో నీటి నిల్వ కుంటల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సీఎస్ సూచించారు. 45 రోజులకు ఒకసారి కచ్చితంగా మండల సమావేశాలను నిర్వహించేలా సంబంధిత అధికారులు ప్రణాకళిలను రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్‌‌లు సవ్యసాచి ఘోష్, దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -