నవతెలంగాణ – హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే వివాదంపై మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనప్పటికీ, ఆయన వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. కనీసం క్షమాపణ కూడా కోరకుండా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా లోతుకుంట పరిధిలోని 40 ఎకరాల భూమిలో జులై 17న హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కమిషనర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, వివాదాస్పద భూమి విషయంలో మళ్లీ జోక్యం చేసుకోబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే, చట్టం ముందు అందరూ సమానమే అనే ప్రాథమిక సూత్రం దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది.



