నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహేశ్ (17), లక్ష్మీ తేజ (17) మరో స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడేందుకు ఒకే స్కూటీపై వెళ్తున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేరుకోగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ వారి వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేశ్, లక్ష్మీ తేజల తలలకు తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలవ్వగా, చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.



