Monday, July 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుచెర్వుగట్టులో అగ్ని ప్రమాదం

చెర్వుగట్టులో అగ్ని ప్రమాదం

- Advertisement -

​​​బూడిదైన 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు
పంచాయతీ రికార్డులు, ఫర్నీచర్‌ దగ్ధం
రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం
​బాధితులకు తక్షణ సాయం అందించిన ఎమ్మెల్యే వీరేశం
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటనలు

​నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గుట్ట కింద శనివారం అర్ధరాత్రి ‌జరిగిన భారీ అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లో మంటలు వరుస దుకాణాలను చుట్టుముట్టి 17 శాశ్వత దుకాణాలు, 15 తోపుడు బండ్లను బూడిద చేశాయి. పంచాయతీ కార్యాలయ రికార్డులు కూడా దగ్ధమయ్యాయి. ఆస్తినష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఘటన అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. పూర్తి స్థాయి పరిహారం కోసం బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

​​​గ్యాస్ సిలిండర్లు పేలడంతో తీవ్రరూపం
​మంటల వేడికి రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో అగ్నిప్రమాదం మరింత ఉధృతమైంది. మొత్తం 17 శాశ్వత దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వ్యాపించడంతో కీలక ప్రభుత్వ రికార్డులు, దస్త్రాలు, ఫర్నిచర్ పూర్తిగా ఖాళీపోయాయి. ఈ ప్రమాదంలో రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ​అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో దుకాణాల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. దుకాణాల్లోని సరుకంతా మంటల్లో పూర్తిగా ఖాళిపోడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

​బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వీరేశం
​ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధిత వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, పూర్తిగా దగ్ధమైన 20కి పైగా చిన్న దుకాణాల యజమానులకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక భద్రతను బలోపేతం చేయాలని, విద్యుత్ వ్యవస్థను సమగ్రంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.

​​క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన
​జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. బాధితుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు చర్యలు ప్రారంభించారు.

​​మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ
​అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వ్యాపారులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తక్షణమే పూర్తి పరిహారం ప్రకటించాలని కోరారు.

​న్యాయం చేయాలని బీజేపీ ధర్నా
​అగ్నిప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో చెర్వుగట్టు వద్ద ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలకు పూర్తి ఆర్థిక సహాయం, దుకాణాల పునర్నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

​ గాలిలో భద్రత
​ప్రముఖ పుణ్యక్షేత్రంలో వరుసగా దుకాణాలు ఉన్నప్పటికీ తగిన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, విద్యుత్ లైన్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి సమగ్ర పరిహారం అందించి తమ జీవనాధారాన్ని పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -