ఆర్టీవో కార్యాలయాల్లో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత
జలగల్లా పీడిస్తున్న క్యూఆర్
రేడియం కాంట్రాక్టర్లు
వాహనదారుల జేబులకు చిల్లు..
ఎంఎఫ్‌జీఓ నెం.60 వెంటనే రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ – ఉప్పల్
రాష్ట్రంలో ఆర్టీఓ కార్యాలయాల్లో నయా దందా సాగుతోంది. క్యూఆర్ రేడియం పేరిట ఆర్టీఓ కార్యాలయాల్లో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత తీరు నడుస్తోంది. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అధికారులే పరోక్షంగా బడా కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోయినా ప్రభుత్వ కార్యాలయాల్లో బడా కాంట్రాక్టర్లు చెప్పిందే వేదంగా నడుస్తుండటం గమనార్హం. రోడ్డు భద్రతా ప్రమాణాల మేరకు వాహనాలకు అవసరమైన నాణ్యత కలిగిన రిఫ్లెక్టివ్ (3ఎం) రేడియం ఉంటే సరిపోతుంది. అయితే రాష్ట్రంలో ఎంఎఫ్‌జీఓ నెం.60 పేరుతో తీసుకొచ్చిన విధానం ద్వారా నిర్దిష్ట క్యూఆర్ రేడియం స్టిక్కర్‌ను అధికారులు తప్పనిసరి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం రాని రేడియాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో రూ.500 నుంచి రూ.1,000లో పూర్తయ్యే రేడియం ఏర్పాటు ఖర్చు, ఇప్పుడు రూ.3 వేల నుంచి 7 వేలు వసూల్ చేస్తున్నారని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాహనాల వారీగా వసూళ్లు ఇలా..
1.3 టన్నుల లోపు వాహనాలు – రూ.2,500 నుంచి రూ.3,000, మధ్యతరహా వాహనాలు – రూ.3,000 నుంచి రూ.4,000, భారీ వాహనాలు – రూ.3,000 నుంచి రూ.7,000 వసూల్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక రేట్లు, సూచిక బోర్డులు కనిపించడం లేదని, రశీదులు కూడా ఇవ్వడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఎవరి నిబంధనా..?
ఇప్పటికే వాహనానికి నిబంధనల ప్రకారం రేడియం ఉన్నప్పటికీ, అది చెల్లదని చెబుతూ క్యూఆర్ రేడియం స్టిక్కర్ కొనుగోలు చేస్తేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనా? లేక కాంట్రాక్టర్ విధించిన షరతా? అని వాహనదారులు అడుగుతున్నారు. ప్రభుత్వ నిబంధన అయితే ప్రభుత్వ ఖజానాకు డబ్బులు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు అధికారులు సిద్ధపడటం లేదు. ఒక్క రోజు ఒక్క ఆర్టీఓ కార్యాలయంలో రూ.3 లక్షలు వసూల్ చేస్తే.. రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు వసూళ్లు వసూలు కావాలి. ఇంత ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఎటు పోతుందనే ప్రశ్న. ఈ వసూళ్లలలో ఎలాంటి సూచిక బోర్డులూ, నిర్ణీత ధర లేవు. కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తి నిర్ణయించిన ధరకు మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున చోట చెప్పుకోమని అంటు న్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
ఎంఎఫ్‌జీఓ నెం.60ను వెంటనే రద్దు చేయాలి
క్యూఆర్ రేడియం పేరుతో రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్ల వెనుక అసలు లబ్ధిదారులు ఎవరు? ఈ వసూళ్ల ద్వారా ఎవరికెంత వాటా వెళ్తోంది? అనే అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలిటం నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాహనదారులపై వేల రూపాయల ఆర్థిక భారం మోపడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. క్యూఆర్ రేడియం పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లకు కారణమవుతున్న ఎంఎఫ్‌జీఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉంటే వారిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాహనదారుల నుంచి వసూలైన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది, దానికి ఎవరు బాధ్యులు అనే విషయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరారు.
తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలిటం నరసింహారెడ్డి
నయా ‘దందా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



