ప్రారంభించిన కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి
వచ్చే ఏడాది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం
ట్రిపుల్‌ఆర్‌పై త్వరలోనే మోడీ శుభవార్త
హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నవతెలంగాణ-కొమురవెల్లి
తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కొమురవెళ్లి పుణ్యక్షేత్రంలో రైల్వే హల్ట్ స్టేషన్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టమన్నారు. రెండేండ్లలో ఈ స్టేషన్‌ను నిర్మించి స్వామి వారి సన్నిధిలో భక్తులకు అంకితం చేస్తున్నామని.. దూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనా నికి వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రూ.20తో ఇక్కడికి రావచ్చన్నారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ లైన్‌ను త్వరలోనే రూ.300 కోట్లతో విద్యుద్దీకరిస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31తేదీ లోగా సిరిసిల్లకు రైలు ప్రారంభిస్తా మన్నారు. వచ్చే ఏడాది వేములవాడ, 2029లోగా కొత్తపల్లి వరకు ఈ రైల్వేలైన్ పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరా బాద్ నుంచి యాదాద్రి వరకు రూ.500 కోట్లతో నిర్మించ బోయే ఎంఎంటీఎస్ రైలుకు రాష్త్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇవ్వాల న్నారు. రూ.3500 కోట్లతో పాండురంగాపురం, భద్రాచలం పనులు పూర్తి చేయబోతున్నామని, తెలంగాణలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐదు వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చిందన్నారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందనీ.. వచ్చే ఏడాది దాన్ని ప్రారం భించుకోబోతున్నామన్నారు రూ.5 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు బుల్లెట్ ట్రైన్ల ద్వారా జరుగుతోందని.. తెలంగాణ అభివృద్ధిలో బుల్లెట్ ట్రైన్లు గేమ్ చేంజర్ కాబోతు న్నాయన్నారు. ట్రిపుల్ ఆర్కు సంబంధించి త్వరలోనే మోడీ శుభవార్త అందిస్తారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. లక్షలాది మంది మల్లన్న భక్తులు అనేక ఏండ్లుగా రైల్వే స్టేషన్ కావాలని కోరినట్లు తెలిపారు. ప్రభు త్వం వారి కోరికను నెరవేర్చిందన్నారు. అంతకుముందు కొము రవెల్లి మల్లన్న ఆలయాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు మాధవనేని రఘునందన్‌రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పింగళి శ్రీపాల్ రెడ్డి, అంజిరెడ్డి, రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.



