ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు
నందన్ నీలేకని నేతృత్వం
ఐదుగురు సభ్యులతో కమిటీ : ప్రధాని మోడీ వెల్లడి
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దుమారం రేపిన వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫారసు లకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఈ టాస్క్‌ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుంది. కమిటీ నివేదిక అధారంగా విశ్వసనీయత దెబ్బతినకుండా భవిష్యత్‌లో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రశ్నపత్రం లీకేజీని అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం. విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానం అమలు చేస్తాం. పరీక్షల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీని అవలంబిస్తాం’’ అని మోడీ తన వీడియోలో పేర్కొన్నారు.
టాస్క్ ఫోర్స్ సభ్యులు వీళ్లే..
నందన్ నీలేకనితో పాటు మరో ఐదుగురు ఈ టాస్క్ ఫోర్సులో సభ్యులుగా ఉంటారు. సోమనాథ్ (ఇస్రో మాజీ చైర్మె న్), తపన్ డేకా (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్), వి. కామకోటి (ఐఐటీ మద్రాస్ డైరెక్టర్), అనితా కర్వాల్ (కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి), అమృత్ లాల్ మీనా (లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణుడు).
ప్రధాన బాధ్యతలు
ఎన్‌టీఏ పరీక్ష వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించడం పరీక్షల్లో సాంకేతిక భద్రతను బలోపేతం చేయడం పేపర్ లీకులు, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు కొత్త వ్యవస్థలు రూపొందించడం పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలు సూచించడం డిజిటల్ భద్రత, అభ్యర్థుల ధ్రువీకరణ, డేటా రక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు సిఫారసు చేయడం భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలు పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడం



