Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంజంతర్ మంతర్ నిరసనలో ఆహారం అందించటం నేరమా..?

జంతర్ మంతర్ నిరసనలో ఆహారం అందించటం నేరమా..?

- Advertisement -

ముస్లిం 
కుటుంబాన్ని 
అదుపులోకి 
తీసుకున్న యూపీ పోలీసులు
లక్నో :
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న యువతరానికి ఆహారం, నీరు అందించారనే కారణంతో ఓ ముస్లిం వ్యక్తి, అతని కుటుంబసభ్యులపై యూపీ పోలీసులు కన్నెర్ర చేశారు. ఘజియాబాద్‌లో వారిని అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం పోలీసులు ఘజియాబాద్‌లోని తన ఇంటికి వచ్చి తన తండ్రిని తీసుకెళ్లారని, ఆ రాత్రి ఆలస్యంగా ఆయనను విడుదల చేశారని ముహమ్మద్ జునైద్ మీడియాకు తెలిపారు. మరుసటి రోజు ఉదయం అధికారులు తిరిగి వచ్చి తన తండ్రిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా పోలీసులు మీరట్‌లో తన సోదరి మామను, బావమరిదిని అదుపులోకి తీసుకుని ఘజియాబాద్ జిల్లాలోని మసూరి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆయన ఆరోపించారు. పోలీసులు తన తల్లిదండ్రులు, తోబుట్టువుల బ్యాంక్ పాస్‌బుక్‌లతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారని జునైద్ తెలిపారు. జునైద్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తేనే వారిని విడుదల చేస్తామని అధికారులు తన కుటుంబ సభ్యులతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.
తనపై ఎటువంటి క్రిమినల్ కేసు లేదని, తాను ఎటువంటి నేరం చేయలేదని ఆయన చెప్పారు. ఎండ తీవ్రతలో నిరసనకారులు తాగునీరు పొందడానికి ఇబ్బంది పడుతున్నట్టు గమనించిన జునైద్, జూన్ 6న నిరసన ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ సేవలు అందించినట్టు తెలిపారు. మొదట నీటిని పంపిణీ చేయడం ప్రారంభించానని, ఆ తర్వాత స్వచ్ఛంద సేవకులు ఆహారం, ఇతర నిత్యావసరాలను అందించేలా ఆ ప్రయత్నాన్ని విస్తరించారని ఆయన చెప్పారు.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఈ చర్యను విమర్శించింది. నేరస్థులను వదిలేసి ఒక స్వచ్ఛంద సేవకుడిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉత్తరప్రదేశ్ పోలీసులు “తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని” పేర్కొంది. “మా బృందం అతనితో సంప్రదింపులు జరుపుతోంది. అతన్ని లేదా అతని కుటుంబాన్ని బాధితులుగా మారనీయం” అని ఆ ప్రచార బృందం తెలిపింది. ఏదైనా చట్టవిరుద్ధమైన పోలీసు చర్యను సవాలు చేస్తూ చట్టపరంగా పోరాడుతామని ఆ ప్రచార బృంద ప్రతినిధి పేర్కొన్నారు. “జునైద్ కుటుంబంపై సాగుతున్న చట్టవిరుద్ధమైన, ఏకపక్ష, అమానవీయ చర్యలను” ఆపివేయాలని, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు. అయితే, జునైద్ కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీరట్ పోలీసులు ఖండించినట్టు పిటిఐ నివేదించింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవినాష్ పాండే శనివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, “అలాంటి విషయమేదీ తన దృష్టికి రాలేదు” అని చెప్పారు.
మీరట్ పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల అధిపతులతో ఈ ఆరోపణలను ధ్రువీకరించుకున్నారని, జిల్లాలో జునైద్ కుటుంబ సభ్యులలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తేలిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినాయక్ గోపాల్ భోంస్లే పీటీఐకి తెలిపారు. తన బంధువులు నివసిస్తున్న మీరట్‌తో సహా పలుచోట్ల, ఘజియాబాద్ పోలీసు సిబ్బందే ఈ అరెస్టులు చేశారని జునైద్ ఆరోపించారు. పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఘజియాబాద్ సీనియర్ పోలీసు అధికారులను వ్యాఖ్యల కోసం సంప్రదించగా వారు అందుబాటులో లేరని పీటీఐ నివేదించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోజ్‌ జనతా పార్టీ’ రాజకీయ ప్రచార బృందం నిరసన ప్రారంభించడంతో ఈ ఆందోళన మొదలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -