Monday, July 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థుల పోరాటానికి ఐద్వా అభినందనలు

విద్యార్థుల పోరాటానికి ఐద్వా అభినందనలు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వాణిజ్యీకరణ, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న విద్యార్థులకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) హృదయపూర్వక అభినందనలు తెలిపింది. విద్యార్థుల ప్రజాస్వా మ్యబద్ధమైన, ధైర్యసాహసాలతో కూడిన, నిరంతర పోరాట ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొంది. ఉద్యమంలో ఇదో ఒక ముఖ్యమైన విజయమని తెలిపింది. ఈమేరకు ఆదివారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. ఈ ఘటనల కారణంగా విద్యార్థులు తీవ్ర నిరాశ, మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడటం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా కాలం పాటు విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా, లాఠీచార్జీలు, నిర్బంధ చర్యల ద్వారా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దేశ యువత వెనక్కి తగ్గకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించడంతో చివరకు ప్రభుత్వం ప్రధాన డిమాండ్ ముందు తలవంచాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో యువ విద్యార్థినులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషమని తెలిపారు. ఈనెల 20న జరిగిన క్రూరమైన పోలీసు దాడిలో అనేక మంది విద్యార్థినులు హింసకు, లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను ఖండించారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఒక్కటే సరిపోదని, పదేపదే ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -