Monday, July 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు

ఒకరిద్దరితోనే తెలంగాణ రాలేదు

- Advertisement -

సమిష్టి పోరాటంతోనే 
ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరామ్
ఉద్యమకారులను గుర్తించేందుకే ప్రభుత్వం కమిటీ వేసిందని వ్యాఖ్య
నవతెలంగాణ-కాగజ్‌నగర్

‘తామే తెలంగాణ తెచ్చామని ఒకరిద్దరు వ్యక్తులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు. మనందరం కలిసి కోట్లాడితేనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గట్టిగా ప్రజలు నమ్ముతున్నారు. కులమతాలు, సంఘాలకు అతీతంగా ప్రతిఒక్కరూ చేసిన సమిష్టి పోరాటమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైంది’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సభ్యులు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు.అసలైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 679 జీఓ జారీ చేసిందన్నారు. ఇప్పటికే 18 రోజులపాటు సమావేశాలు జరిపామన్నారు.ఈ సమావేశాలకు 13 వేల మంది హాజరవ్వగా వెయ్యి మందితో మాట్లాడించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులతోనూ ఒకరోజు సమావేశం కావాల్సి ఉందని అన్నారు. వీరందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతే విధి విధానాలు ఖరారుచేసి ఉద్యమకారుల నుండి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఎవరూ మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ఇప్పటికీ కొందరు ఆంధ్రాప్రాంత నాయకులు తెలంగాణపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని అన్నారు. అంతకుముందు కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అమరులైన ఉద్యమకారుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -