Tuesday, July 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజెన్‌ జీత్‌ గయా

జెన్‌ జీత్‌ గయా

- Advertisement -

కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ.. కదిలి వచ్చిన విద్యార్థులు… ఒకవైపు అధికారపక్షం అహంకారం… మరోవైపు న్యాయవ్యవస్థ వ్యంగ్యం…ఇంకోవైపు మతవాదుల అభాండాలకు వేటికీ వెనుదీయక విద్యార్థుల భవిష్యత్తును భుజానికెత్తుకొని దేశ యవనికపైకి మెరుపులా దూసుకొచ్చి యువ కిశోరాలు… జంతర్‌ మంతర్‌ వేదికగా భూకంపం పుట్టించారు. ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. ‘నీట్‌’ ఫెయిల్యూర్‌పై పోరాటమే కావచ్చు. కానీ, అది బీజేపీ పన్నెండేండ్ల నిర్బంధస్వామ్యపు ఉక్కపోతల నుంచి…వాళ్లు పతాకాలుగా పైకి లేచారు. నినాదమై ప్రతిధ్వనించారు. లాఠీలకు బెదరలేదు. పెల్లెట్‌ గన్స్‌కు వెరవలేదు.. వాటన్నింటిని వడిసిపట్టి వడిసెలో రాళ్లు పెట్టి కొట్టినట్టు మీమ్స్‌తో కొట్టారు. ఆ చెకుముకి రాళ్లు సోషల్‌మీడియాలో అగ్గిని రాజేశాయి. యావత్‌ దేశాన్ని కదిలించాయి. ఉక్కుపిడికిలి సడలకుండా ఉద్య మాన్ని నడిపించాయి. చివరకు మోడీ ప్రభుత్వం తలొంచక తప్పలేదు. నిరంకుత్వానికన్నా యువశక్తి అజేయమని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిరూపించింది. మోడీ ప్రభుత్వం మెడలు వంచి జెన్‌‌జీ సాధించిన విజయం. అది ఈ దేశ విద్యావ్యవస్థను, యువత భవిష్యత్తును కాపాడుకోవడానికి సాగిన ఒక వీరోచిత ఘట్టం.
చలో పార్లమెంట్‌‌లో జాతీయ జెండాలు చేతబూని లాఠీచార్జి నడుమ వందేమాతరం, జనగణమన పాడి పోలీసులను వాళ్లు కదలకుండా చేసిన దృశ్యాలు శాంతియుత నిరసనను కొత్తపుంతలు తొక్కించాయి. సాధారణ ఆందోళ నలకు ఇది అవుటాఫ్‌ సిలబస్‌! విదేశీశక్తులు, పాకిస్థాన్‌ ఫండింగ్‌, మతవిభజన వంటి ఆరోపణలను వాటి పద్ధతిలోనే తిప్పికొట్టింది జెన్‌‌జీ. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అని నినదించే ఆ యువ గొంతుకలను ఎలా కట్టడిచేయాలో విశ్వగురుకే అంతుచిక్కలేదంటే… దానికి ‘బొద్దింకల’ ఐక్యతే కారణం.

వర్షాన్ని, చలిని, పోలీసుల లాఠీలను, బెదిరింపులను తట్టుకుని జంతర్‌మంతర్ వేదికగా విద్యార్థులు సాగించిన సుదీర్ఘ పోరాటం పాలకుల నిరంకుశ వైఖరిని దించేలా చేసింది. ఈ విజయం కేవలం విద్యా రంగానికి సంబంధించిన తాత్కాలిక సడలింపులకే పరిమితం కాదు. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం విద్యావ్యవస్థను ప్రయివేటీకరిస్తూ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తున్న పాలకుల వినాశకర విధానాలకు నిరసనగా వినిపించిన ఒక బలమైన గొంతుకగా నిలుస్తోంది. సోనమ్‌ వాంగ్‌చూక్ దాదాపు ఇరవై రోజులు నిరాహార దీక్ష చేసినా కనీసం చర్చలు చేయకపోగా, ఆందోళన చేస్తున్న వారిని అపఖ్యాతి పాలు చేయడానికి ఎన్ని దారులున్నాయో ప్రభుత్వం అన్నింటినీ ఉపయోగించింది. ఏడాదికి పైగా ఢిల్లీ పొలి మేరల్లో రైతులు ఉద్యమమిస్తే భీష్మించుకు కూర్చున్న మోడీ ఆఖరికి దిగిరాక తప్ప లేదు. ఈసారి కూడా యువత ఉద్యమానికి తలొగ్గవలసి వచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి చేసే ఏ ఉద్యమమైనా తమ లక్ష్యాన్ని చేరుకుం టాయని ఈ ఉద్యమాలు భరోసా ఇస్తున్నాయి.
జంతర్ మంతర్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది గుమిగూడడం, అక్కడ ఉన్న వారికి జనం స్వచ్ఛందంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కుల,మతాలకు అతీతంగా అన్నపానాదులు సమకూర్చడం ఈ దేశ సాంస్కృతిని చాటింది. ఆ మాత్రం సహాయమైనా అందకుండా చేయ డానికి ప్రభుత్వం చేయని కుటిలయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వాలు పోలీసులను ముందుకు తోయడం అన్ని ప్రభుత్వాలు చేసే దురాగతమే కావొచ్చు. కానీ, ఆందోళన చేస్తున్న విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడం దగ్గర నుంచి మొదలుపెట్టి పోలీసుల లాఠీలకు మేకులు బిగించి చితక బాదడం దాకా సహించరాని దాష్టీకం. ఆ దృశ్యాలు దేశమంతటినీ కలచి వేశాయి. ఇప్పటికే ఈ దుర్మార్గాన్ని ఐరాసతో సహ అనేక దేశాలు తూర్పారపట్టాయి.

చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేయాల్సివచ్చింది. అందులో తాను తప్పుచేశానన్న పశ్చాత్తాపం కించిత్ కూడా లేదు. ఉందల్లా మూర్తీభవించిన అహంకారమే. ఈ ఉద్యమం నుంచి దేశ వ్యతిరేక శక్తులు ప్రయోజనం పొందకూడదని తాను రాజీమానామా చేశానంటూ సుద్దపూస మాటలు వల్లించారు. ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు జరగని నష్టం ఉద్యమం వల్లే జరిగిందని చెప్పడం ఆయనకే చెల్లింది. ఏ విద్యార్థీ కేసుల్లో ఇరుక్కోకూడదని ఆయన భావించారట. ఉద్యమం వల్ల విద్యార్థుల చదువుకు భంగం కలగకూడదనుకున్నారట. ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? ఉద్యమం శాంతియుతంగా సాగింది. లాఠీ దెబ్బలను ఎదు ర్కున్న తీరు యువత శాంతి కాంక్షకు ప్రతీక. ప్రధాన మంత్రి రీళ్లు తయారు చేయడం, జాతీయ పరీక్షా వ్యవస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించిన ఆలోచనే చేయలేదు.
ఈ విజయం విద్యార్థి ఉద్యమ చరిత్రలో ఒక నూతన ఆశాదీపం. కానీ, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నట్టు ఇది ముగింపు కాదు, భవిష్యత్తులో రాబోయే విస్తృత పోరాటాలకు ఆరంభం మాత్రమే. దేశ యువతను, ప్రజల్ని మతం మత్తులో ఉంచి రాజకీయాలు చేస్తూ, మనుస్మృతిని అమల్లోకి తేవాలని తీవ్రంగా శ్రమిస్తున్న పాల కులకు ఈ ఉద్యమం ఒక హెచ్చరిక. సుమతీ శతకకారుడు కనుక ఈ పోరాటాన్ని చూసి ఉంటే..‘‘బలవంతుడైన పాలకుడు ‘బొద్దింకల’ చేత చిక్కి తలవంచునె సుమతీ’’..అని కచ్చితంగా రాసి ఉండేవాడు!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -