పథకం అమలు ఉసేత్తని ప్రభుత్వం
మండలంలో 1137 మంది ఎంపిక
సాయం పొందింది 37 మంది మాత్రమే
నవతెలంగాణ – మల్హర్ రావు
రెక్కాడితే గాని డొక్కాడని భూమిలేని నిరుపేద ఉపాధి హామీ (వీబీ-జీ రామ్ జీ) కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అటకెక్కింది. కూలీల కష్టాల్లో తోడుంటాం..ఏటా ఆర్థిక భరోసా ఇస్తాం అంటూ పదే పదే చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపో యాయి. పథకం ప్రారంభంలో ఊరించిన ఉత్సాహం..ఆ తర్వాత నీరుగారి పోయింది. మండల వ్యాప్తంగా 8,495 జాబ్ కార్డులు,18,873 ఉపాధిహామీ కూలీలు, యాక్టివ్ 10,632 కూలీలు, సెంట్ భూమి లేక సరైన రాబడి లేక 11 73 నిరుపేద కూలీలు అల్లాడుతున్నారు. అర్హులైన పేదలకు అందించాల్సిన ఆత్మీయ భరోసా మాత్రం మున్నాళ్ల ముచ్చటగానే మారింది.
కొందరికే పరిమితం..
మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో దాదాపు 1173 మంది నిరుపేద కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో కేవలం 37మందికి మాత్రమే రూ. 6వేల చొప్పున భరోసా అందించారు. ఆ తర్వాత పథకం అమలును పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో మిగతా కూలీలు ప్రభుత్వ సాయం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ పనులు సైతం కరువయ్యాయి. ఈ నేపథ్యంలో నిరుపేద కూలీలకు ఆత్మీయ భరోసా అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.



