యుద్ధ ఫలితంగా సంక్షోభంలో కూరుకుపోయిన దేశం
జెన్జీ ఉద్యమం గొప్పది : సీపీఐ(ఎం)
కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
ప్రజాస్వామ్యమంటే పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడమని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. డబ్బు, మద్యం, అధికార బలంతో ఓట్లను కొనుగోలు చేసే దుస్థితికి దేశం నెట్టబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలున్న వ్యక్తులుగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారని గుర్తుచేశారు. దేశంలో పేద వాడు, మధ్య తరగతి వారు పోటీ చేసే పరిస్థితే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను కొనుగోలు చేసే స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా గెలిచిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే దిగజారుడు తనానికి పాలకవర్గ పార్టీలు దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఇంకా దారుణమైన విషయమేమంటే శాసనసభా పక్షాన్నే విలీనం చేస్తే పోతుందనే దారుణ పరిస్థితికి రాజకీయ నాయకులు దిగజారుతున్నారని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వస్తే కొన్ని అమ్ముడుపోయిన కార్పొరేట్ పత్రికలు వార్తలను వండి వడ్డిస్తున్నాయని చెప్పారు. యుద్ధ ఫలితంగా మన దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని వాపోయారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎదురులేని శక్తిగా ఉన్న అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇరాన్ ప్రపంచ పోలీస్ ను గడగడలాడిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఇటీవల వచ్చిన జెన్ జీ ఉద్యమం ఎంతో గొప్పదని తమ్మినేని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం- ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కృషిలో నవతెలంగాణ అగ్రగామిగా నిలబడాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పత్రిక నిలబడిందంటే దానికి సిబ్బంది, విలేకరుల త్యాగాలే కారణమని కొనియాడారు.



