Sunday, August 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం

ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం

- Advertisement -

జెన్ జీల పోరాటం స్ఫూర్తిదాయకం
ఎవరెన్ని కుట్రలు పన్నినా కమ్యూనిజం అజేయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయమని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన నవ తెలంగాణ 11వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ… ‘మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నా దక్కలేదు. నిరంకుశత్వాన్ని నమ్ముకునే వ్యక్తులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు. హిట్లర్‌ ‌లాంటి వారే చరిత్రలో కనుమరుగయ్యారు. చీమలు చిన్నవైనా అన్ని కలిస్తే కాలకూట నాగులు సైతం నేలలో కలవాల్సిందే. ఢిల్లీ పుర వీధుల సాక్షిగా బొద్దింకలు చేసి చూపించాయి…’ అని వ్యాఖ్యానించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌‌లో జరిగిన ప్రజాపోరాటాలు దేశంలోనూ పునరావృతమవుతాయనే భయంతోనే కేంద్రం దిగొచ్చిందని ఎద్దేవా చేశారు. నేటి సమాకాలీన పరిస్థితుల్లో జెన్‌ ‌జీల పోరాటం ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజలు రాసుకున్న రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందులోని సోషలిజం, సెక్యూలరిజం అనే పదాలను తొలగించేందుకు మోడీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలను ప్రజలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలో సైతం కరుడు గట్టిన కాషాయ భావజాలం గల వ్యక్తులను జొప్పిస్తున్నారని విమర్శించారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో 70 శాతానికి పైగా కాషాయీకరణ జరిగిందన్నారు. ఈ పరిణామాలు రాజ్యాంగం, ప్రజాస్వామం, పత్రికా స్వేచ్ఛకు పెను ప్రమాదమని హెచ్చరించారు. బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న ఈ నిరంకుశ చర్యలను విద్యార్థులు, యువత అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్ని మార్పులొచ్చినా కమ్యూనిజం అజేయంగా నిలబడిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పోరాటాలను ముందుండి నడిపించింది ఎర్రజెండాలేనని కొనియాడారు. అవి నిర్వహించే ప్రజా ఉద్యమాలకు పత్రికలు బాసటగా నిలవాలన్నారు. ఆ దిశగా నవ తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -