Sunday, August 2, 2026
E-PAPER
Homeసోపతిఫీల్డ్‌ నోట్స్‌

ఫీల్డ్‌ నోట్స్‌

- Advertisement -

స్టోరీ క్లియర్‌గా ఒకటే.
స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (SEZ) పేరుతో గ్రామాల ఆక్రమణ. సర్కార్‌ ఫైళ్లలో అది ”డెవలప్‌మెంట్‌”. ప్రజల జీవితాల్లో మాత్రం ”నిర్వాసనం”. అది చూడటానికే తెల్లవారుజామున కారులో బయలుదేరాం. బయలుదేరే ముందు చెప్పా…
”ఇది రిసార్ట్‌ ట్రిప్‌ కాదు,” అని.
”అందుకే వస్తున్నా,” అంది.
ఆ మాట ప్రయాణం మొత్తం మా వెంట వచ్చింది.
హైదరాబాద్‌ నెమ్మదిగా వెనక్కి జారిపోతోంది.
కాంక్రీట్‌ భవనాల స్థానంలో పచ్చని పొలాలు కనిపించసాగాయి.
రోడ్డు పక్కన మధ్య మధ్యలో కనిపిస్తున్న బోర్డులు…
LAND ACQUIRED FOR SEZ..
ఆమె కిటికీ బయటే చూస్తోంది.
”ఇక్కడి వాళ్లకు ఈ బోర్డులు చూస్తే ఏమనిపిస్తుందో…” అంది మెల్లగా.
నేను సమాధానం చెప్పలేదు.
ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం ఫైళ్లలో దొరకదు. ఈ నేల మీద నడిచిన మనుషుల అడుగుజాడల్లో ఉంటుంది. ఆ జాడల్ని వెతుక్కుంటూనే మా కారు గ్రామంలోకి చేరుకుంది.
రోడ్డు పక్కన కూల్చేసిన ఇళ్లు. పగిలిన గోడలు. ఎండిపోయిన బోర్లు. ఒక ఇంటి ముందు తులసి కోట మాత్రం కూలిపోయిన ఇంటి జ్ఞాపకంగా ఇంకా నిలిచి ఉంది.
కొద్దిదూరంలో ఒక పెద్ద బోర్డు…
FUTURE GLOBAL INDUSTRIAL HUB – SEZ PROJECT
ఆ బోర్డు కింద ప్లాస్టిక్‌ కుర్చీలో ఒక వద్ధ రైతు కూర్చున్నాడు.
కారు ఆపాం.. బ్యాగ్‌, నోట్‌ బుక్‌ తీసుకుని దిగి ఆయనవైపు నడిచాం. కానీ ఆయన లేవలేదు.
”తాతా.. మీ భూమి ఎంత పోయింది?” అని అడిగా.
ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు.
పొలాలవైపు చూస్తూ నెమ్మదిగా చెప్పాడు.
”భూమి మాత్రమే కాదు బిడ్డా…
ఇప్పుడు ‘నేను ఎవరు?’ అనేది కూడా పోయింది.”
ఆ ఒక్క మాటలో గ్రామమంతా వినిపించింది.
నోట్‌బుక్‌ మూసేశాను. కొన్ని మాటలు రాసుకోవడం కాదు, మనసులో మోసుకెళ్లాలి.
మేం ముందుకు నడిచాం.
కొద్ది దూరంలో ఒక మహిళ నిలబడి ఉంది.
”ఇక్కడ మా ఇల్లు ఉండేది,” అంది.
ఇప్పుడు అక్కడ సర్వే రాళ్లు మాత్రమే ఉన్నాయి.
ఇంటి జాడగా మిగిలింది ఒక నీలిరంగు తలుపు ముక్క మాత్రమే.
”మొదట కంపెనీ వాళ్లు వచ్చి…
ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు.
తర్వాత అధికారులు వచ్చి భూమి రేట్లు చెప్పారు.
మేము ఒప్పుకోకపోతే పోలీసులతో వచ్చారు.
కేసులు పెట్టారు.
బెదిరించారు.
చివరికి మా భూమిలో మేమే అక్రమంగా మారిపోయాం.”
ఆ మహిళ మాట్లాడుతుండగానే ఆమె వెనక ఒక చిన్న పాప వచ్చి నిలబడింది.
చేతిలో స్కూల్‌ బ్యాగ్‌. కానీ స్కూల్‌ లేదు. ఇల్లు లేదు.
ఆమె చాలా సేపు ఆ పిల్లనే చూస్తూ నిలబడిపోయింది.
మళ్లీ మా నడక మొదలైంది.
కొంతదూరం వెళ్లాక ఆమె మెల్లగా అంది…
”భూమి పోతే మనిషి కేవలం ఆస్తి మాత్రమే కోల్పోడు రామ్‌… తన జ్ఞాపకాలు… తన గౌరవం… తన భవిష్యత్తు కూడా పోతాయి.”
నేను భుజాన బ్యాగ్‌ సర్దుకుంటూ అన్నా.
”ఎమోషన్‌తో రిపోర్ట్‌ చేయలేం.”
ఆమె వెంటనే నా వైపు తిరిగింది.
”అయితే మనుషుల బాధని ఎక్కడ నమోదు చేయాలి?”
నేను మౌనంగా ఉన్నా.
ఆమె ఆగలేదు.
”నువ్వు ‘బలవంతంగా భూసేకరణ జరిగింది’ అని రాస్తే అది న్యూస్‌ మాత్రమే అవుతుంది. కానీ ‘ఒక పిల్ల తన ఇంటి అడ్రెస్‌ కోల్పోయింది’ అని రాస్తే…
అది జీవితం అవుతుంది రామ్‌.”
ఆ మాటలతో ఆ రోజు నా నోట్‌బుక్‌లో గణాంకాల కంటే మనుషులే ఎక్కువయ్యారు.
రాత్రికి గ్రామంలోని ఓ పాత గెస్ట్‌ హౌస్‌లో ఆగాం.
నేను కుర్చీలోకి చేరి ల్యాప్‌టాప్‌ తెరిచాను. ఆమె కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిని చూస్తోంది. నేను కీబోర్డ్‌ మీద వేళ్లు కదుపుతుండగానే కరెంట్‌ పోయింది. గది మొత్తం చీకటి.
”ఒక్క నిమిషం… ఫోన్‌ టార్చ్‌ వేస్తా,” అన్నాను.
”వద్దు.. బయటికి వెళ్దాం.” అంది.
మేమిద్దరం బయటకు నడిచాం.
చల్లని గాలి.. మట్టివాసన.. ఆకాశం నిండా నక్షత్రాలు.
సహజంగానే నేను ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నా. ఆమె వెనక్కి తీసుకోలేదు. ఆ స్పర్శలో ఒకరి మౌనాన్ని మరొకరు వినగలిగేంత దగ్గరితనం ఉంది.
కొద్దిసేపు మట్టిబాటలో ఇద్దరం నెమ్మదిగా నడిచాం.
”రామ్‌…” అంది ఆమె.
”హ్మ్…”
”మనిషి తన పుట్టిన నేల మీద కూడా హక్కు కోల్పోతే… దాన్ని అభివద్ధి అంటామా?” అంది.
నేనేమీ మాట్లాడలేదు.
గెస్ట్‌ హౌస్‌కి తిరిగి వచ్చేసరికి అర్థరాత్రి దాటిపోయింది.
మళ్లీ ల్యాప్‌టాప్‌ తెరిచాను.
పదాలు వెతకాల్సిన అవసరం రాలేదు..
రిపోర్ట్‌ పూర్తయ్యాక స్క్రీన్‌ మీద అక్షరాలకు బదులు మనుషులే కనిపించారు.
వార్తలంటే కేవలం సంఘటనలను నమోదు చేయడం కాదు. కనిపించకుండా పోతున్న జీవితాలకు సాక్ష్యంగా నిలబడటం.
ఆ రాత్రి నేను రాసింది ఓ వార్త కాదు… కనిపించకుండా పోతున్న జీవితాలను.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -