సౌందర్యం అంటే ఏమిటి? సాంకేతికంగా ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ క్లిష్టతకు ప్రధాన కారణం.. సామాన్య జీవితాన్ని ఒక కళగా చూడటం అనే ఆలోచన పూర్వం నుంచీ ఉన్నా, పాశ్చాత్య సౌందర్యశాస్త్రం ఎక్కువ కాలం కళలకు, ప్రత్యేక నైపుణ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, నిత్యజీవితపు సామాన్య అనుభవాలను నిర్లక్ష్యం చేసింది. ఈ ఇరుకైన దృక్పథంలో ‘కళ అంటే ప్రత్యేకమైన నైపుణ్యంతో సృష్టించిన వస్తువు, దాన్ని ఆస్వాదించాలంటే ఆచరణతో సంబంధం లేని విలక్షణమైన చూపు కావాలి’ అనే అభిప్రాయం ఏర్పడింది. ఫలితంగా సౌందర్యశాస్త్రం లలిత కళలకు, అద్భుత ప్రకృతి దృశ్యాలకు, మ్యూజియం కళాఖండాలకు మాత్రమే పరిమితమైపోయింది. అయితే ఇరవయ్యవ శతాబ్దం చివర్లో ఈ పరిమితుల్ని బద్దలు కొడుతూ కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. అదే నిత్యజీవన సౌందర్యశాస్త్రం (Everyday Aesthetics).
సౌందర్యం అనేది మ్యూజియంలకో, అద్భుత దృశ్యాలకో పరిమితమైన విలక్షణ అనుభూతి కాదని, రోజూ చేసే పనులు, వాడే వస్తువులు, నడిచే దారులు, మనుషుల మధ్య అనుబంధాల్లో కూడా అది దాగి ఉందని ఈ దృక్పథం స్పష్టం చేస్తుంది. ఈ తాత్వికతకు ఒక సజీవ ఉదాహరణగా రస్కిన్ బాండ్ జీవితాన్ని చూడవచ్చు. ఆయన రాసిన ‘ఒక ఏకాంతజీవి బ్రతుకుబాట’ ఎనభై మూడేండ్ల జీవిత ప్రయాణాన్ని, అరవై ఐదేండ్ల రచనా వ్యాసంగాన్ని నిస్సంకోచంగా, హృదయపూర్వకంగా పంచిన ఆత్మకథ. ప్రముఖ రచయిత, యాత్రికుడు దాసరి అమరేంద్ర ఈ ఆంగ్ల రచనను తెలుగుదనంతో, అత్యంత సహజమైన శైలిలో అనువదించారు.
నిత్యజీవన సౌందర్యశాస్త్రం ఒక ప్రత్యేక అధ్యయన రంగంగా ఆధునిక కాలానికి చెందినదే అయినా, పైన పేర్కొన్నట్లు సామాన్య జీవితాన్ని ఒక కళగా చూడటం అనేది పూర్వం నుంచీ వస్తున్న ఆలోచనే. ప్రముఖ పరిశోధకురాలు కాట్యా మాండోకి ఈ విషయాన్ని చక్కగా విడదీసి చెప్పారు. కళల గురించి, కావ్యాల గురించి చర్చించే విధానాన్ని ‘పొయెటిక్స్’ అంటారు. అలాగే నిత్యజీవనంలోని సౌందర్యాన్ని విశ్లేషించే భావనను ‘ప్రొసాయిక్స్’ అని ఆమె పేర్కొన్నారు. ఆమె వాదన ప్రకారం, గొప్ప కళాఖండాలను చూసి పొందే ఆనందం కంటే ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే అసలైన అనుభూతి దాగి ఉంటుందన్నారు. రస్కిన్ బాండ్ జీవితం ఈ నిత్యజీవన సౌందర్య విశ్లేషణకు సజీవ నిదర్శనం. ఆయన తన ఆత్మకథలో ఎక్కడా కృత్రిమమైన ఆదర్శాల్ని పొగడలేదు, అసాధారణ విజయాల్ని ప్రస్తావించలేదు. జామ్‌నగర్ రాచరికపు వాతావరణంలో పెరిగినా, ఆయన దృష్టంతా భవనాల బయట ఉన్న పచ్చికబయళ్ల మీద, పాతగోడల దగ్గర కనిపించే పాముల మీద, ఆకాశంలో ఎగిరే పక్షుల మీదే నిలిచేది. ఆడంబరమైన రాజుల కంటే, అధికారుల కంటే ఇంట్లో పనిచేసే ఆయాలతో, వంటవారితో, తోటమాలులతో ఆయనకు ఎక్కువ స్నేహం ఉండేది. సమాజంలో అట్టడుగున ఉన్న ఈ సామాన్యుల జీవితాల్లో సైతం సజీవమైన సౌందర్యం పుష్కలంగా ఉంటుందని ఆయన గుర్తించారు. ఇది పాశ్చాత్య సంప్రదాయిక సౌందర్యశాస్త్రానికి పూర్తి భిన్నమైన దృక్కోణం. జీవితపు అంచుల్లో నిలిచిన మనుషుల అనుభవాల నుంచే ఆయన తన కలం ముడిసరుకును సేకరించారు.
నడక అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, అది ఒక లోతైన సౌందర్యాత్మక అనుభూతి అని చాలామంది తత్వవేత్తలు వివరించారు. థామస్ లెడ్డీ ప్రాచీన చైనీస్ తత్వవేత్త జువాంగ్జీ సిద్ధాంతాలను గుర్తుచేస్తూ ఈ విషయాన్ని బలపరిచారు. మనం నడుస్తున్నప్పుడు దారిలో కనిపించే చెట్లు, ఇరుకు సందులు, పాతబడిన గోడలు, పక్షుల కిలకిలరావాలు ఇవన్నీ మనలో ఒక తాత్విక స్పహను నింపుతాయి. రస్కిన్ బాండ్ జీవితంలో నడక అంతర్భాగం. జామ్‌నగర్ వీధుల్లో, డెహ్రాడూన్ అడవుల్లో, లండన్ మహానగరంలో ఆయన ఎంతోసేపు నడిచేవారు. నడుస్తున్నప్పుడు ఎడ్లబండ్లు, సైకిళ్లు, ఆకుల మధ్య నుంచి జారిపడే సూర్యరశ్మి, పాడుబడిన ఇళ్లలో నివసించే గుడ్లగూబలు, అడవి పిల్లులు వంటివి ఆయన్ని ఆకట్టుకునేవి. ఇలా అతి సామాన్యమైన అంశాలను గమనించడాన్నే థామస్ లెడ్డీ మైక్రో ఈస్తెటిక్స్ (సూక్ష్మ సౌందర్య దృష్టి)గా పేర్కొన్నారు. రస్కిన్ బాండ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కళాకారుడి దృష్టితో చూస్తూ, నడక ద్వారా ప్రాపంచిక విషయాలతో బలమైన అనుసంధానాన్ని ఏర్పరుచుకున్నారు.
సౌందర్యం అంటే ఆహ్లాదం మాత్రమే అనుకోవడం చాలా పరిమితమైన ఆలోచన. మురికి, చిందరవందర, అపరిశుభ్రత, విసుగు, ఏకాంతం వంటివి కూడా సౌందర్య విశ్లేషణలో భాగమేననియూరికో సైతో స్పష్టం చేశారు. జీవితంలో ప్రతికూల పరిస్థితుల్ని స్వీకరించినప్పుడే మనిషి పరిపూర్ణతను సాధిస్తాడని ఆమె భావన. రస్కిన్ బాండ్ బాల్యం ఇలాంటి ప్రతికూలతల మధ్యే సాగింది. తల్లిదండ్రులు విడిపోవడం, తండ్రి ఆకస్మిక మరణం, సవతి తండ్రి ఇంట్లో నిరాదరణ వంటి సంఘటనలు ఆయన మనసులో తీవ్రమైన ఏకాంతాన్ని, అభద్రతాభావాన్ని నింపాయి. అయితే ఆయన ఈ ఏకాంతాన్ని శాపంగా భావించలేదు. దాన్నే తన రచనా ప్రస్థానానికి పునాదిగా మలచుకున్నారు. తన బాధను నిజాయితీగా అక్షరాల్లో పెట్టడం వల్ల పాఠకులు ఆ రచనలతో గాఢంగా మమేకం కాగలిగారు. రస్కిన్ బాండ్ తన బాధను ఎప్పుడూ దాచిపెట్టలేదు, కత్రిమంగా అందంగా మార్చే ప్రయత్నమూ చేయలేదు.
ఇందులో రెండు ప్రధాన వాదనలు ఉన్నాయి. మొదటిది, నిత్యం చూసే విషయాల్ని కొత్త కోణంలో చూసి వాటిలో అసాధారణ తను వెదకడం. రెండవది, సాధారణ విషయాల్ని సాధారణ మైనవిగానే ఆస్వాదించడం. మనకు పరిచయమున్న ఇంట్లో, వాడే పాత వస్తువుల్లో ఒక విధమైన భద్రత, ప్రశాంతత ఉంటాయని యూరికో సైతో అంటారు. బాండ్ జీవితం ఈ రెండవ కోణానికి ప్రబలమైన ఉదాహరణ. ఆయనకు కొత్త వస్తువుల మీద వ్యామోహం ఎప్పుడూ లేదు. పాత స్టాంపులు సేకరించడం, పాత పుస్తకాల దుకాణాల్లో గడపడం, తన చిన్నప్పటి టైప్‌రైటర్‌తో కథలు టైపు చేయడం ఆయనకు అంతులేని ఆనందాన్నిచ్చేవి. జామ్‌నగర్‌లో సముద్రతీరాన నత్తగుల్లలు ఏరుకోవడం, పాత చిత్రాల ఆల్బమ్‌లు చూడటం, వర్షాకాలంలో తడిసిన నేల సుగంధాన్ని ఆస్వాదించడం ఆయనకు ఎంతో ఇష్టమైన పనులు. ఆధునిక వినిమయ సంస్కతి ఎప్పుడూ కొత్తదనాన్ని, ఖరీదైన వస్తువులను కోరుకుంటుంది. వస్తువు పాతబడగానే పారేయమంటుంది. కానీ బాండ్ పాత కెమెరా, చిరిగిన నోటు పుస్తకాలను ఎంతగానో ప్రేమించారు. వస్తువు కేవలం ఉపయోగపడే సాధనం కాదని, అది మనిషి జీవితంలో భాగస్వామి అని ఆయన నమ్మారు. ఈ దృక్పథం పర్యావరణ స్పహతో కూడిన సౌందర్యానికి గొప్ప ఉదాహరణ.
నిత్యజీవన సౌందర్యశాస్త్రం కేవలం వ్యక్తిగత అనుభవాలకే పరిమితం కాదు. దీనికి బలమైన సామాజిక, రాజకీయ పరిణామాలు ముడిపడి ఉంటాయి. దేశాల నిర్ణయాలు సామాన్యుల రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో రస్కిన్ బాండ్ ఆత్మకథ స్పష్టంగా చూపిస్తుంది. 1947లో దేశ విభజన ఆయన కళ్లముందే జరిగింది. అప్పటివరకు ప్రశాంతంగా సాగిపోయిన డెహ్రాడూన్ వీధులు, సిమ్లా రోడ్లు ఒక్కసారిగా రక్తపాతానికి, మతకల్లోలాలకు వేదికలయ్యాయి. తోటి ముస్లిం విద్యార్థులను మిలిటరీ ట్రక్కుల్లో సరిహద్దులు దాటించడం లాంటి సంఘటనలు నిత్యజీవనం ఎంత పెళుసైనదో నిరూపిస్తాయి. బాండ్ తన రచనల్లో ప్రత్యక్షమైన విప్లవ సిద్ధాంతాలను ప్రతిపాదించకపోయినా, ఈ చారిత్రక గాయాలను సున్నితంగా చిత్రించారు. సాంస్కతిక అధ్యయనాల కోణంలో పరిశీలిస్తే రస్కిన్ బాండ్ ఒక ఆంగ్లో-ఇండియన్. వలసవాదానికి ప్రతీకలైన బ్రిటిష్ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న అస్తిత్వ సంక్షోభం సాధారణమైనది కాదు. చాలామంది లండన్‌కు వెళ్లిపోవాలనుకున్నా ఆయన మనసు మాత్రం భారతదేశపు మట్టితోనే ముడిపడి ఉంది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆయన ఒక అనామకుడిగా, బ్రిటిష్ సమాజంలో తన ఆంగ్లో-ఇండియన్ నేపథ్యం వల్ల తిరస్కరణకు గురైన వ్యక్తిగా మిగిలిపోయారు. చివరకు లండన్‌లో జీవితాన్ని వదిలి తిరిగి డెహ్రాడూన్ చేరుకున్నప్పుడే ఆయన ఆత్మకు నిజమైన సాంత్వన లభించింది.
మనుషులు ఆధునికత పేరుతో ప్రకృతికి ఎంతగా దూరమవుతున్నారో రస్కిన్ బాండ్ తన రచనల్లో సున్నితంగా విమర్శించారు. ప్రకృతిని కేవలం ఒక దృశ్యంగా చూసే పెట్టుబడిదారీ వర్గం ప్రకృతి విధ్వంసాన్ని అభివృద్ధిగా భావిస్తుంది. కానీ ప్రకృతితో సహజీవనం చేసే నిత్య సౌందర్య ఆరాధకుడు మాత్రం పచ్చదనం పోవడాన్ని తన జీవితంలో భాగం కోల్పోవడంగా చూస్తాడు. అలాగే కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్రను నిత్యజీవన సౌందర్యశాస్త్రం దృక్పథంలో పరిశోధకులు ప్రధానంగా చర్చించారు. రస్కిన్ బాండ్ ఆత్మకథలో కనిపించే మహిళా పాత్రలు ఎంతో వైవిధ్యభరితమైనవి. కఠినంగా ఉండే అమ్మమ్మ, ఎప్పుడూ తన ప్రపంచంలో తానుండే తల్లి, ఆయనను అత్యంత ప్రేమతో చూసుకున్న జాలరి కుటుంబానికి చెందిన ఆయమ్మ ఇలా ఎన్నో రకాల పాత్రలు ఉన్నాయి. ఆయమ్మ చేతులు గరుకుగా ఉన్నా ఆ స్పర్శ ఆయనకు ఎనలేని భద్రతను ఇచ్చింది. బంధం అనేది రక్తసంబంధంతో కాకుండా శ్రద్ధ, ప్రేమల ఆధారంగా నిర్మితమవుతుందని ఇది నిరూపిస్తుంది. అలాగే లండన్‌లో ఆయన కలుసుకున్న వియత్నాం యువతి ‘వూ’ దొంగతనం చేసినా ఆమెలోని మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవడం ఆయన పరిపక్వతకు నిదర్శనం. మానవ సంబంధాల్ని లాభనష్టాలతో కాకుండా నిస్వార్థమైన అనురాగంతో కొలవడం రస్కిన్ బాండ్ జీవితంలో అడుగడుగునా కనిపిస్తుంది.
ఒక రచయిత విజయం అతను రాసే భాష మీద మాత్రమే ఆధారపడదు. అతను ఎంచుకునే ఇతివత్తం పాఠకుల జీవితాలకు ఎంత దగ్గరగా ఉందనేది కీలకం. రస్కిన్ బాండ్ ఎప్పుడూ విప్లవాల గురించీ, సామాజిక సిద్ధాంతాల గురించీ పెద్దగా రాయలేదు. ఆయన కలం బంజరు భూమి మీద పూసే పుష్పాలను, సమస్యలున్న మూగ కుర్రాడితో ప్రేమను, సామాన్య శ్రమజీవుల కష్టసుఖాలను మాత్రమే అక్షరబద్ధం చేసింది. ఆయన రచనా ప్రక్రియ కూడా ఒక నిత్యజీవన కార్యకలాపమే. జీవితాంతం ఒక చిన్న గదిలో, రెండు కిటికీల పక్కన కూర్చుని ఆకాశంలో వచ్చే మార్పుల్ని, పక్షుల రాకపోకల్ని గమనిస్తూ అక్షరాలకు ప్రాణం పోశారు. మొత్తంగా చూస్తే నిత్యజీవన సౌందర్యశాస్త్రం వస్తువుల అమరికకో, అందమైన వాతావరణానికో సంబంధించిన తాత్వికత కాదు. అది జీవితాన్ని దాని సకల రూపాల్లో చీకటి వెలుగులతో, కష్ట సుఖాలతో, మురికి పరిశుభ్రతలతో ఉన్నది ఉన్నట్లుగా ఆలింగనం చేసుకునే అద్భుత జీవన కళ. రస్కిన్ బాండ్ ఆత్మకథ ‘ఒక ఏకాంతజీవి బ్రతుకుబాట’ ఈ తాత్వికతకు ప్రతిబింబం.
ప్రొ|| గంపా వెంకటరామయ్య, 9958607789



