మెట్రోలో గుండె, ఊపిరితిత్తుల తరలింపు
గచ్చిబౌలి ‘కేర్ ’ఆస్పత్రి నుంచి
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి
నవతెలంగాణ -సిటీబ్యూరో
సకాలంలో అవయవ మార్పిడి చికిత్స అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి సహకారం అందించింది. దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను గచ్చిబౌలిలోని ‘కేర్ హాస్పిటల్’ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని ‘కిమ్స్ హాస్పిటల్’కు మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించా రు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రసూల్‌పురా మెట్రో స్టేషన్ వరకు..14 కిలోమీటర్లు (13 స్టేషన్లు) దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో శనివారం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:05 వరకు పూర్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు, ఆస్పత్రి వర్గాలు, వైద్య నిపుణుల పరస్పర సమన్వయంతో ఈ ‘ప్రయారిటీ మెడికల్ ట్రాన్సిట్’ ప్రక్రియ వేగంగా పూర్తయింది. రవాణాతో పాటు అత్యవసర ప్రాణరక్షణ వైద్య సేవలకు తోడ్పడటంలో హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ మెట్రో నిరంతరం ముందుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.



