Sunday, August 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధరణి అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ

ధరణి అక్రమాలపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ

- Advertisement -

పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టం
నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదు
భూముల ధరల సవరణతో పెరిగిన 20 శాతం ఆదాయం
త్వ‌ర‌లో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనికోసం ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని స్పష్టం చేశారు. శనివారంనా డిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డు పెట్టుకొని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యూటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని, ఎవరి హయాంలో ఎంత భూమి నిషేధిత జాబితాలో చేరిందో తేలుస్తూ, త్వరలో నిజాలను ప్రజల ముందుంచుతామన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిషేధిత జాబితాలో ఎంత భూమి ఉంది? ఆ భూములను ఎవరు, ఎప్పుడు, ఏ కారణాలతో చేర్చారు? తర్వాత ఎందుకు తొలగించారు? అనే ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నామనీ, కొత్తగా ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధరణి పోర్టల్‌లో ఉన్న జాబితానే కోర్టుకు సమర్పించామనీ, వివాదాలు లేని ప్రయివేటు ఆస్తులు, ప్లాట్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు.

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే 276 గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందనీ, ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదనీ, కేవలం రెండు శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని వివరించారు. రాష్ట్రంలో సుమారు 85 వేల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటి విషయంలో సమగ్ర విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ధోరణి ఉండబోదని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కొల్లూరులో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌‌రూం ఇండ్లలో వర్షం వస్తే నీళ్లు కారుతున్నాయనీ, వారి నాణ్యతా ప్రమాణాలు అవేనని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా, లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫైనల్ బిల్లులు చెల్లిస్తుందని తెలిపారు. భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే 10 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం వచ్చిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్షిక ఆదాయం దాదాపు రూ.13 వేల కోట్లు ఉండగా, గత ఏడాది అది రూ.15 వేల కోట్లకు చేరిందనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టంచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -