నవతెలంగాణ – హైదరాబాద్ :గోదావరి నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) సూచించింది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13,16,221 క్యూసెక్కులుగా నమోదైంది.
వరద ప్రవాహం గరిష్ఠంగా 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరి, ఆదివారం రాత్రి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గి 54.3 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. కునవరం వద్ద 21.40 మీటర్లు, పోలవరం వద్ద 13.19 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పలు జాగ్రత్తలు సూచించారు.



