Wednesday, August 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసోషలిజం దిశగా అమెరికన్ యువత,కార్మికవర్గం!

సోషలిజం దిశగా అమెరికన్ యువత,కార్మికవర్గం!

- Advertisement -

“దేశభక్తి యుతంగా పెట్టుబడిదారీ విధానం పనిచేస్తున్నదని సగం మంది కంటే తక్కువ మంది అమెరికన్లు అనుకుంటున్నారు, ప్రజాస్వామ్యా నికి మద్దతు పడిపోయింది” – న్యూయార్క్ పోస్ట్.
“హౌస్ ప్రైమరీస్ (పార్లమెంటు ప్రజా ప్రతిని ధుల సభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం పార్టీలో జరిగే పోటీ)లో ఆకస్మికంగా డెమోక్రటిక్ సోషలి స్టులు ఎందుకు దూసుకుపోతున్నారు” – న్యూస్ వీక్.
“అంకెలు అబద్దాలు చెప్పవు. యువ అమెరికన్లు సోషలిజం ప్రేమలో పడుతున్నారు” -ఫాక్స్ న్యూస్. “సోషలిజానికి పెరుగుతున్న యువత మద్దతు తొలి రోజుల అమెరికా పాఠాలను గుర్తుకు తెస్తున్నది ” కరోలినా జర్నల్. “అమెరికాలో పెట్టుబడిదారీ విధానపు ప్రతిష్ట యాభై నాలుగు శాతానికి పడిపోయింది”-గాలప్ న్యూస్. “యువ అమెరికన్లు సోషలిజాన్ని మరీ అతిగా అభిమానిస్తున్నారు.స్వేచ్చా వాదులు విధిగా అడ్డుకోవాల్సిన సమస్య ఇది” -కాటో ఇనిస్టిట్యూట్. “ముఫ్పైతొమ్మిది శాతం మంది అమెరికన్లు సోషలిజాన్ని ఆమోదిస్తున్నారన్న స్కాట్ బెసెంట్. వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టలేదు” -గఫార్చ్యూన్. పైన పేర్కొన్నవి అమెరికన్ మీడియాలో గత ఏడాది కాలంలో, ఇటీవల వచ్చిన కొన్ని వార్తా వ్యాఖ్యల శీర్షికలు. అక్కడి సమాజంలో వస్తున్న ఆలోచనా ధోరణులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి.

వీటిని చూసి డోనాల్డ్ ట్రంప్ వంటి నయా ఫాసిస్టులు తమ ఆందోళన, అక్కసులను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీన్ని బట్టి వెంటనే అమెరికాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు కానుందని ఎవరూ నిర్దారణకు రానవసరం లేదు.అక్కడి పాలకవర్గం అంత తేలికగా తన అధికారాన్ని వదులుకోదు. గత గురువారం నాడు వాషింగ్టన్ పోస్టు పత్రిక -ఐసోస్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు అభ్యర్ధి రంగంలో ఉంటే ఓటు వేయటం గురించి ఆలోచిస్తామని నమోదైన ఓటర్లలో నలభై శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు మూడు పదుల వయస్సులోపు వారు 46శాతం మంది, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదార్లలో 64 శాతం ఉన్నట్లు కూడా సర్వే పేర్కొన్నది. ఈ పత్రిక అమెజాన్ కంపెనీ అధిపతి జెఫ్ బెజోస్ యాజమాన్యంలో నడు స్తున్నది. అలాంటి కార్పొరేట్ల పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలిసిందే. అయితే సర్వేలను తిమ్మిని బమ్మిని చేస్తే కుదరదు గనుక ఇష్టం ఉన్నా లేకున్నా వివరాలను వెల్లడించకతప్పటం లేదు. అయితే ఈ సర్వే వార్తలోనే ఎక్కువ మంది అమెరికన్లు డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ(డిఎస్‌పి) అభ్యర్ధికి మద్దతు ఇవ్వటం లేదని కూడా రాసింది. సిఎన్‌ఎన్ మీడియా సంస్థ కోసం ఎ‌స్‌ఎ‌స్‌ఆ‌ర్‌ఎస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో డెమోక్రాట్లు, ప్రజాస్వామిక భావాలకు మద్దతు ఇచ్చేవారిలో మూడో వంతు మంది తాము డెమోక్రటిక్ సోషలిస్టులమని చెప్పుకున్నారని, వారిలో 45 ఏండ్ల లోపువారు 59 శాతం మంది ఉన్నట్లు తేలింది.

మూడింట రెండు వంతుల మంది నవంబరు మూడున జరిగే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని కూడా చెప్పారు. డెమోక్రటిక్ పార్టీలో తెల్లవారితో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు బాహాటంగా తాము డెమోక్రటిక్ సోషలిస్టుకే ఓటు వేస్తామని చెప్పారు. డెమోక్రటిక్ సోషలిస్టులుగా చెప్పుకున్న వారిలో 66 నుంచి 54శాతం మందికి డిగ్రీలు లేవు, వారి వార్షిక ఆదాయం 76 నుంచి 65శాతం మందికి లక్ష డాలర్ల లోపే ఉంది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మన దేశంలో చెప్పుకొనే బడుగు బలహీన వర్గాలు అమెరికాలో సోషలిజానికి అనుకూలంగా ఉన్నాయి. డెమోక్రటిక్ సోషలిస్టుల్లో 48శాతం మంది గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయిల్‌కు అమెరికా సాయం నిలిపివేయాలనే అభ్యర్ధికే మద్దతు ఇస్తామని చెప్పటం కూడా గమనించాల్సిన అంశం. అమెరికా సమాజం మొత్తంగానే ఇరాన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నది. శ్వేత జాతీయుల్లో ఎగువ మధ్య తరగతి మాత్రమే సోషలిజానికి అనుకూలంగా ఉన్నట్లు మీడియాలో వచ్చే విశ్లేషణలు వాస్తవం కాదని కూడా సిఎన్‌ఎన్ సర్వే తేల్చింది. జీవిత అనుభవాల నుంచే జనాలు సోషలిజానికి మద్దతు ఇస్తారని ప్రపంచ వ్యాపితంగా వెల్లడైన సత్యం. దీనికి అమెరికన్లు మినహాయింపు ఎలా అవుతారు! దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం ఎంత ఎక్కువగా కనిపిస్తే అంతగా ప్రత్యామ్నాయ విధానాలవైపు జనాలు చూస్తారు.

పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులకు పెరుగుతున్న మద్దతు గురించి ఆ పార్టీలోని మితవాదులు కూడా ఆందోళన చెందుతున్నారు. జూలై నెలలో న్యూయార్క్, కొలరాడోలో అభ్యర్ధిత్వాలకు డెమోక్రటిక్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో నాలుగు ప్రజాప్రతినిధుల స్థానాల్లో డిఎస్‌పి మద్దతు ఉన్న అభ్యర్ధులే గెలిచారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓడించారు. మిచిగాన్ రాష్ట్ర సెనెట్ స్థానానికి అబ్దుల్ ఎల్ సయీద్ అనే వామపక్షవాది పోటీ పడుతున్నాడు. డెమోక్రటిక్ సోషలిస్టులందరూ మద్దతు ఇస్తుండగా ఇజ్రాయిల్‌ అనుకూల వాది అయిన ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ హాలే స్టీవెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్, ఇతరులు ప్రచారం చేస్తున్నారు. విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నర్ పదవికి డిఎస్‌పి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ పరిణామాన్ని చూసిన తరువాత రిపబ్లికన్లు ఆందోళనపడుతున్నారు. ఉదారవాదులు కమ్యూనిజం గురించి ఆలోచించకుండా చూడాలంటూ ఆ పార్టీకి చెందిన వారు ఒక సమావేశంలో కోరారు. ఒక కార్యా చరణ పథకాన్ని కూడా రూపొందించారు. జూలై 20వ తేదీన రూపొందించిన ఒక పత్రంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. “ సోషలిజం, మార్క్సిజం కంటే కమ్యూనిజం మరింత ప్రమాదకరమని అమెరికన్లు ఇప్పటికీ భావిస్తున్నారు. ఈ మూడు భావాలు తలెత్తటానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ విషపూరిత వక్ష ఫలాలే అవి గనుక, వారందరితో సంబంధాలు పెట్టుకొని వారిని దూరం చేయటం రిపబ్లికన్లకు ముఖ్యమైనది” ఇటీవల సిఎన్‌బిసి చేసిన సర్వేలో డోనాల్డ్ నినాదమైన మాగా(అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) కంటే డెమోక్రటిక్ సోషలిజం నినాదమే బహళ ఆదరణ కలిగి ఉందని తేలింది.

డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులను చూపి భయపెట్టటాన్ని డెమోక్రటిక్ పార్టీ మానుకోవాలని కొందరు సలహా ఇచ్చారట. ఎందుకంటే ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ఆదరణ పొందుతున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలో జోహ్రాన్ మందానీ విజయం వెల్లడించింది. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు కూడా రంగంలో ఉండి మందానిని ఓడించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ విధానాలను విమర్శించిన లేదా వ్యతిరేకించినవారినందరినీ దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్, తుకడే తుకడే గ్యాంగ్ అని ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తనను వ్యతి రేకించే వారందరికీ డోనాల్డ్ ట్రంప్ “కమ్యూనిస్టు” ముద్ర వేస్తున్నాడు. ఇది నష్టదాయకమని రిపబ్లికన్ మేధావులు వాపోతున్నారు. ప్రతివారినీ కమ్యూనిస్టులని ముద్రవేస్తే సభల్లో చప్పట్లు కొట్టవచ్చు, ఈలలు వేయవచ్చు, ఒకటి రెండు సార్లు మధ్యంతర ఎన్నికల్లో ఓట్లు కూడా పడవచ్చు గానీ పదే పదే ప్రతివారినీ కమ్యూనిస్టు అంటే అవును అయితే ఏమిటి? అని యువతరం ప్రశ్నించే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా అదే జరుగు తున్నది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఒకవైపు దాని సమర్ధకులే చెబుతుండగా మరోవైపు సోషలిస్టు చైనా సాధిస్తున్న అద్భుత విజయాలు, అమెరికాను సవాలు చేస్తున్న తీరును చూసి యువత సోషలిజం పట్ల సానుకూల వైఖరిని పెంచుకుం టున్నది.

ట్రంప్ సర్కార్ కొన్ని స్వతంత్ర వాణిజ్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తున్నదని, కమ్యూనిస్టులు అదే చేస్తారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినందున ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్యలను “మాగా మావోయిజం ” అని వర్ణిస్తున్నా రని, కమ్యూనిస్టులను భూతాలుగా చూపి భయపెట్టే క్రమంలో ఉదారవాదులకు సైతం అలాంటి ముద్రవేస్తూ ట్రంప్ నష్టం చేస్తున్నారని, ఎన్నికల ముందు తెలివైన అమెరికన్ ఓటర్లు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటారని రిపబిక్లన్ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కాలచక్రాన్ని వెనక్కు తిప్పాలని చూస్తున్న పచ్చి మితవాద రిపబ్లికన్లు కూడా ఉన్నారు. 1950 దశకంలో మాదిరి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం తప్ప మరొక మార్గం లేదని భావిస్తున్నారు. వారి బుర్రలకు ఎక్కనిదేమంటే అప్పుడూ ఇప్పుడూ పరిస్థితి ఒకే విధంగా లేదు. నాడు సోషలిస్టు, కమ్యూనిస్టు భావనలు యావత్ ప్రపంచాన్ని ఊపివేశాయి. ఇప్పుడు అలా లేదు. కమ్యూనిజాన్ని అంతం చేశామని చెప్పుకున్నవారే ఇప్పుడు కమ్యూనిస్టు బొమ్మ భూతాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి గుండెలు బాదుకుంటూ భయాన్ని నటిస్త్తే జనాలు నవ్వుతారు తప్ప నమ్మరు. “మాలాంటి తరం ప్రచ్చన్న యుద్ధంలో కమ్యూనిజం వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది.ఇప్పుడు మన గడ్డ మీద కమ్యూనిజం పునరాగమనంలో ఉంది.అమెరికా ఉనికికే ముప్పుగా మారింది” అని జూలై మూడవ తేదీన మౌంట్ రష్‌మోర్ సభలో ట్రంప్ చెప్పాడు.“వాషింగ్టన్ లేదా మాస్కో, ఏదో ఒకటే రాజధానిగా ఉండాలి.

స్వచ్చమైన,శుద్దమైన, తాజా గాలివీచే స్వేచ్చాయుత అమెరికా వాతావరణమే ఉండాలి లేదా చెడువాసనలు వచ్చే కమ్యూనిస్టు రష్యా అయినా ఉండాలి ” అంటూ న్యూయార్క్ మాజీ గవర్నర్ అల్ స్మిత్ 1936లో కమ్యూనిస్టు ఉన్మాదిగా చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి ఉపన్యాసాలే చేస్తున్నాడు. జూలై 21వ తేదీన అమెరికా విదేశాంగశాఖ “క్యూబా : ఇరవై ఒకటవ శతాబ్దపు కమ్యూనిజం రాజధాని” అనే శీర్షికతో ఒక నివేదిక విడుదల చేసింది. దానిలో అనేక అవాకులు చవాకులు, వక్రీకరణల గురించి మనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. దానిలో కమ్యూనిజం కంటే అమెరికాలో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ నేతలుగా ఉన్న జోహ్రాన్ మందానీ, జర్నలిస్టు ఆమీ గుడ్‌మాన్ వంటి ఎందరిమీదనో క్యూబా ప్రయాణీ కులంటూ వక్రీకరణ దాడిచేశారు.
కమ్యూనిజం వ్యతిరేకత అధికారిక మతం మాదిరి ఉన్న అమెరికాలో నిజంగానే యువత, కార్మికవర్గంలో సోషలిజం పట్ల, వామపక్ష భావజాలం వైపు మొగ్గటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ప్రధాన స్రవంతి మీడియాలో గత కొన్ని దశాబ్దాలుగా చిలవలు పలవలుగా కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారం తప్ప అనుకూల వ్యాఖ్యానాలు ఎక్కడా కనపడ లేదు.

మరోవైపు సోషలిజం భావజాలానికి జనం దూరమయ్యారని భావిస్తున్న అనేక మందికి ఎంతో ఊరట కలిగిస్తున్న పరి ణామం. కొంతమంది డిఎస్‌పి నిజమైన సోషలిస్టు భావనలను ముందుకు తీసుకురావటం లేదని, సంస్కరణవాదంతో ఉందని విమర్శిస్తున్నారు. ఇక్కడ గమనిం చాల్సిన అంశం ఏమంటే అసలు సోషలిజమంటేనే ఆమడ దూరం వెళ్లే వాతావరణం నుంచి సానుకూలతవైపు మళ్లటమే పెద్ద మార్పు. సంస్కరణ వాదం వరకు వచ్చిన వారు అది పని చేయదు అను కుంటే శాస్త్రీయ సోషలిస్టు భావనకు మారటం తధ్యం, అయితే దానికి ఎంతకాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయిన తరువాత ఇలాంటి మార్పు వస్తుందని ఎవరైనా ఊహించారా? ఏదైనా అంతే, పరిస్థితులే జనాలను ఎటువైపు నడిపించాలో నిర్దేశిస్తాయి!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -