Tuesday, August 4, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రచారం పటాటోపం

ప్రచారం పటాటోపం

- Advertisement -

‘మాదకద్రవ్య రహిత భారత్’ లక్ష్యంగా వంద వారాల ప్రచారాన్ని ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రధానమంత్రి ఆదివారం వర్చువల్ గా ప్రారంభించారు. యాథా ప్రకారం ‘అణిచేస్తాం… కోరలు పీకేస్తాం.. యువతను గుల్లచేస్తున్న మాదకద్రవ్యాలను అరికడతాం’ అంటూ ప్రధానమంత్రి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. అందులో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందగానే సాగింది. ‘యువతే మన దేశ భవిత అని తెలుసుకున్న శత్రు దేశాలు ఉగ్ర పన్నాగాల్లో భాగంగా మన భూభాగాల్లోకి మత్తు పదార్థాలను చేరవేస్తున్నాయి’ అని ప్రధాని ఆరోపించారు. అదే నిజమైతే సరిహద్దు భద్రత, ఇంటెలిజెన్స్, సుంకాలు, ఓడరేవుల పర్యవేక్షణ అంతా కేంద్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉన్నప్పుడు… మరి ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు దేశంలోకి ఎలా రాగలుగుతున్నాయి? భద్రతా లోపాలను అంగీకరిం చకుండా కేవలం శత్రు దేశాలపై నెపం నెట్టడం ద్వారా పాలకులు తమ పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడమే.

పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం వెనుక ఉన్న అసలు సామాజిక-ఆర్థిక కారణాలను పాలక వర్గాలు సగం సత్యాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. యువతను కేవలం శాంతిభద్రతల సమస్యగా, చట్టవిరుద్ధ పనులకు పాల్పడే నేరస్థులుగా మాత్రమే చిత్రించడం ప్రభుత్వాల అలవాటుగా మారింది. మత్తు సంస్కృతి సమాజాన్ని కమ్మేస్తున్న వేళ, దానికి మూలకారణమైన వ్యవస్థాగత వైఫల్యాలను, కార్పొరేట్ లాభాల కోణాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రగతిశీల శక్తులపై ఉంది.
మత్తు పదార్థాల వ్యాపారం అనేది నేడు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ కార్పొరేట్ నెట్ వర్క్ గా మారింది. దేశంలోని ఓడరేవులు, సరిహద్దుల గుండా వేల కిలోల డ్రగ్స్ దిగుమతి అవుతుంటే, ప్రధాన సూత్రధారులు, అదృశ్య దిగ్గజాలు సురక్షితంగా బయటపడుతున్నారు. చట్టం ప్రతిసారీ చిరు వ్యాపారులనో లేక, యువతనో జైళ్లలో పెట్టి చేతులు దులుపుకుంటోంది. బహుళజాతి డ్రగ్ మాఫియా, రాజకీయ-అధికార యంత్రాంగం మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేయకుండా కేవలం ‘అవగాహనా సదస్సులు’ నిర్వహించడం కేవలం తూతూమంత్రంగా చేసే కార్యక్రమం మాత్రమే అవుతుంది.

అసలు యువత మత్తు వైపు ఎందుకు మళ్లుతోంది? దశాబ్దాలుగా అమలు జరుగుతున్న కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ప్రభుత్వ రంగాలు దెబ్బతిన్నాయి. నాణ్యమైన విద్య, ఉద్యోగ భద్రత కరువయ్యాయి. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, గౌరవప్రదమైన ఉపాధి లేక కోట్లాది మంది యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తుపై అభద్రతా భావంతో ఉన్న యువతను మత్తు పదార్థాల మాఫియా సులభంగా తమ వలలో వేసుకుంటోంది. నిరుద్యోగ రహిత సమాజాన్ని నిర్మించడంలో విఫలమైన వ్యవస్థే, యువతను ఈ ఊబిలోకి నెట్టివేసింది.‘నషా ముక్త్ యువ’ సాధన అనేది పోలీసుల లాఠీలతోనో, కఠిన చట్టాలతోనో సాధ్యమయ్యేది కాదు. మత్తుకు బానిసలైన యువతను శిక్షించాల్సిన నేరస్థులుగా కాక, ఈ లోపభూయిష్ట వ్యవస్థాగత బాధితులుగా చూడాలి. ఉచిత, నాణ్యమైన పునరావాస కేంద్రాలను ప్రభుత్వ రంగంలో విస్తృతంగా ఏర్పాటు చేయాలి. వైద్యం, కౌన్సెలింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి.
యువత శక్తిని మత్తు పదార్థాల ఊబి నుంచి కాపాడుకోవడం అంటే, ఈ వ్యవస్థ వైఫల్యాలపై ఉద్యమించడమే. ఉపాధి హక్కు, సామాజిక భద్రత కోసం సాగే పోరాటమే నిజమైన ‘నషా ముక్త్’ సమాజానికి పునాది.దేశంలోని ప్రధాన పోర్టులు, ప్రయివేట్ పోర్టుల ద్వారా టన్నుల కొద్దీ డ్రగ్స్ దేశంలోకి ముందెన్నడూ లేనంతగా దిగుమతి అవుతుంటే, ఆ అదృశ్య దిగ్గజాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది. డ్రగ్స్ వ్యసనానికి గురైన యువతను శారీరక, మానసిక వైద్యం అందించాల్సిన ‘బాధితులు’గా చూడకుండా, నేరస్థులుగా చిత్రీకరిస్తూ జైళ్లలో వేస్తున్నారు. మరోవైపు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న పెద్ద పెద్ద డ్రగ్స్ సప్లై సిండికేట్లు సురక్షితంగా బయటపడుతున్నాయి. లాఠీలతో, ప్రతిజ్ఞలతో ఈ సమస్య తీరదు.వంద వారాలపాటు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ.. ప్రతి ఆదివారం క్రీడలు, వాకథాన్, యోగ సెషన్స్, సాంస్కృతిక ప్రదర్శనలు, జాగృతి ప్రచారాలు, చర్చా వేదికలు, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధాని పిలుపు నిచ్చారు. అసలు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోకుండా ఈ కార్య క్రమాల వలన వచ్చే ప్రయోజనం ఎంత? ఇదంతా ప్రచారం పటాటోపమే.

వాస్తవానికి ప్రధాని మోడీ మార్గనిర్దేశంతో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 2020లో ప్రారంభమైంది. అది అందించిన ఫలితాలు ఏమిటో ఇప్పటివరకు తెలియదు. కానీ, మరోసారి అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి కార్యక్రమానికి ప్రారంభించారు. మాదకా సురులపై ఉక్కుపాదం మోపుతామనే ప్రభుత్వాల మాటలు కొన్నేళ్లుగా కోటలు దాటుతూనే ఉన్నాయి. కానీ, పసలేని సర్కారీ చేతల పుణ్యమా అని మత్తుమందులు పప్పుబెల్లాలై ప్రతిచోటా గుట్టల కొద్దీ దొరుకుతున్నాయి. వీటి వలన ప్రయోజనాలు ఏపాటివి?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -