Friday, August 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘స్మార్ట్‌’ గా సంస్కరణలు!

‘స్మార్ట్‌’ గా సంస్కరణలు!

- Advertisement -

రాష్ట్రంలో విద్యుత్‌ భారం పెంచేందుకు రంగం సిద్ధమవుతోందా? స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు అందులో భాగమేనా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ అనుమానాలు నిజమేననిపిస్తున్నాయి. తాజాగా టీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జి. జితేష్‌ వి.పాటిల్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, వాటి వ్యయాన్ని వినియోగదారుల నుంచే విడతలవారీగా వసూలు చేసే అంశంపై చేసిన ప్రకటనలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. సాంకేతిక ఆధునీకరణ పేరుతో మొదలయ్యే ఈ ప్రక్రియ చివరికి విద్యుత్‌ బిల్లుల భారాన్ని పెంచే దిశగా సాగుతుందా? స్మార్ట్‌ మీటర్ల వెనుక కేవలం వినియోగాన్ని కొలిచే ఉద్దేశమే ఉందా? లేక విద్యుత్‌ పంపిణీ రంగాన్ని క్రమంగా ప్రయివేటు సంస్థలకు తెరవడానికి అవసరమైన మౌలిక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారా? ఎందుకంటే, విద్యుత్‌ అంటే ఏ ఒక్కదానితో ముడిపడిన సమస్య కాదు, అది ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాది స్తున్న విద్యుత్‌ రంగ సంస్కరణలను ఈ పరిణామాలతో కలిపి చూస్తే అసలు చిత్రం కొంత స్పష్టమవుతుంది. 2025 విద్యుత్‌ సవరణ ముసాయిదా చట్టం విద్యుత్‌ టారిఫ్‌లు సరఫరా వ్యయాన్ని ప్రతిబింబిం చాలని, కొన్ని రంగాలకు లభిస్తున్న క్రాస్‌ సబ్సిడీలను ఐదేండ్లలో తొలగించాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో ఒకే ప్రాంతంలో ప్రభుత్వ, ప్రయివేటు డిస్కమ్‌లు పోటీ పడేందుకు, ఒక డిస్కమ్‌ నెట్‌వర్క్‌ను మరొకటి ఉపయోగించు ునే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్రం దీన్ని ‘పోటీ’, ‘నాణ్యమైన సేవలు’గా ప్రచారం చేస్తోంది. కానీ విద్యుత్‌ రంగంలో పోటీ అంటే ప్రజలకు చౌక విద్యుత్‌ అందుతుందన్న హామీ ఎక్కడుంది? లాభదాయకమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగ దారుల కోసం ప్రయివేటు డిస్కమ్‌లు పోటీ పడితే, అధిక వ్యయం ఉన్న గ్రామీణ ప్రాంతాలు, చిన్న వినియోగదారులు, పేద కుటుంబాలకు సేవల బాధ్యత ఎవరిది? క్రాస్‌ సబ్సిడీలను క్రమంగా తొలగిస్తే ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారు? కేంద్రం మాత్రం రైతులు, పేదలకు సబ్సిడీ కొనసాగుతుందని చెబుతోంది. కానీ, ఆ సబ్సిడీని రాష్ట్ర బడ్జెట్‌ నుంచే భరిం చాల్సి ఉంటుంది. అంటే కేంద్రం సంస్క రణల నిర్ణయం తీసుకుని, ఆర్థిక బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టే అవకాశం ఉంది.
ఇక్కడే స్మార్ట్‌ మీటర్ల ప్రాధాన్యం పెరుగుతోంది. స్మార్ట్‌ మీటర్‌ సాంకేతికంగా మెరుగైన పరికరమే కావచ్చు. కచ్చితమైన రీడింగ్‌, వినియోగ పర్యవేక్షణ, విద్యుత్‌ నష్టాల గుర్తింపు వంటి ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ, ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది, ఎవరు ఖర్చు భరిస్తారు? అన్నది అసలు ప్రశ్న. వినియోగదారుడే మీటర్‌ ఖర్చును విడతల వారీగా చెల్లించాల్సి వస్తే, ఉచితంగా లేదా సబ్సిడీతో అందే సేవలోకి మరో ఖర్చు చేరినట్టే కాదా? ఇంకా ఆందోళన కలిగించే అంశం ప్రీపెయిడ్‌ విధానం. కేంద్రం ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద భారీ స్థాయిలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
విద్యుత్‌ వినియోగానికి ముందే చెల్లించే విధానం విస్తరించినప్పుడు, డబ్బు లేని కుటుంబానికి విద్యుత్‌ వినియోగం ఎలా ఉంటుంది? ఇప్పటివరకు నెలాఖరులో బిల్లు చెల్లించే కుటుంబం రేపు ముందుగానే డబ్బు జమ చేయాల్సి వస్తే అది సామాన్యులపై ఆర్థిక ఒత్తిడిని పెంచదా? సాంకేతికత పేరుతో విద్యుత్‌ హక్కును ‘చెల్లించే సామర్థ్యం’తో ముడిపెట్టడం ఎంతవరకు సమర్థనీయం? ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా తక్కువ కాదు. కేంద్రం ఏం చెబితే అది అమలు చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పని కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కూడా దాని రాజ్యాంగబద్ధ బాధ్యత. స్మార్ట్‌ మీటర్ల ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాలంటే ముందుగా ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలి. మీటర్‌ ధర ఎంత? నిర్వహణ ఖర్చెంత? ఎన్ని సంవత్సరాలు వసూలు చేస్తారు? ప్రీపెయిడ్‌ విధానం తప్పని సరా? డబ్బు అయిపోతే సరఫరా నిలిపేస్తారా? పేదలు, రైతులకు రక్షణ ఏమిటి? వీటన్నింటికీ స్పష్టమైన సమాధానాలివ్వాలి.
విద్యుత్‌ సంస్కరణల పేరుతో ప్రజలపై భారం మోపడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఉమ్మడి ఏపీలో జరిగిన బషీర్‌బాగ్‌ ఘటన చరిత్ర చెబుతోంది. పెంచిన విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా 2000 ఆగస్టు 28న జరిగిన ‘చలో అసెంబ్లీ’ సందర్భంగా బషీర్‌బాగ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ ఘటన విద్యుత్‌ భారానికి వ్యతిరేక ప్రజాఉద్యమంలో చెరగని ముద్ర వేసింది. దీన్ని పాల కులు మర్చిపోతే ఎలా? అప్పుడు చార్జీల పెంపు ప్రత్యక్షంగా కనిపించింది. ఇప్పుడు సంస్కరణలు, స్మార్ట్‌ మీటర్లు, ప్రీపెయిడ్‌ విధానం, ఖర్చు ఆధారిత టారిఫ్‌, ప్రయివేటు పోటీ వంటి పదాల వెనుక మార్పులు వస్తున్నాయి. వాటి అసలు ప్రభావం బిల్లులో కనిపించిన తర్వాత ప్రజలు ప్రశ్నించే పరిస్థితి రాకూడదు. విద్యుత్‌ వ్యవస్థ ఆధునీకరణ అవసరమే. కానీ, ఆ పేరుతో ప్రజల జేబులు ఖాళీచేసి, ప్రయివేటు సంస్థల ఖాతాలు నింపే సంస్కరణల్ని మాత్రం ప్రజాప్రయోజనం అనలేం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -