ఎన్నికల్లో గెలిచేందుకు మనదేశంలోని బూర్జువా పార్టీల ఆపదమొక్కులు, ఓటర్లకు ప్రలోభాల తీరుతెన్నుల గురించి చెప్పనవసరం లేదు. నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్ ట్రంప్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడా?అంటే అవుననే చెప్పాలి. నవంబరు మూడవ తేదీన పార్లమెంటు ఉభయ సభలకు మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఆ పోరులో అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ కోల్పోనున్నట్లు పండితులు చెబుతున్నారు. తాజాగా ఫైనాన్సియల్ టైమ్స్ సర్వేలో ఎన్నికలలో కేవలం 32శాతం మందే డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు తేలింది. చివరికి అధికార రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడా తగ్గుతూ 72శాతానికి పడిపోయినట్లు కూడా వెల్లడైంది. మరొక సర్వే ప్రకారం అధ్యక్షుడిగా పనితీరును కేవలం 34శాతం మంది రిపబ్లికన్లు మాత్రమే సమర్ధించినట్లు ఎన్‌బిసి న్యూస్ సర్వే వెల్లడించింది. అటూ ఇటూ ఎటు తిప్పి అడిగినప్పటికీ ఓటర్లలో మద్దతు తగ్గుతూనే ఉన్నట్లు వెల్లడౌతోంది. దీంతో దిక్కుతోచని ట్రంప్ ఆగస్టు 30 నుంచి మరోసారి ఇరాన్ మీద దాడులు ప్రారంభించాడు. దాంతో అనివార్యంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తు న్నది. అమెరికా ఐదు ఇరాన్ చమురు టాంకర్ల మీద క్షిపణిదాడి చేస్తే టెహరాన్ కూడా అమెరికా అనుకూల టాంకర్ల మీదనే కాదు, జోర్డాన్‌లోని దాని సైనిక స్థావరాల మీద దాడి చేసి అనేక యుద్ధ విమానాలను నష్టపరి చిందని, నౌకల మీద క్షిపణులను వదలటమే కాదు, ఒక మానవరహిత అమెరికా జలాంతర్గామిని కూడా హార్ముజ్ జలసంధిలో పట్టుకున్నట్లు ప్రకటించింది. చిత్రం ఏమిటంటే అది అంతకు ఒకరోజు ముందునుంచే పనిచేయటం లేదని అమెరికా ప్రకటించింది. ఒకవేళ అదే నిజమనుకున్నా దాని ఆయుధాల సామర్ద్యం ఎంతగా నాసిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నవంబరు మూడున ఎన్నికల్లో తమ అభ్యర్ధులను గెలిపించి ఉభయ సభల్లో మెజారిటీ వచ్చేట్లు ఓటు వేస్తే ప్రతి ఓటరుకు ఐదువేల డాలర్ల(దాదాపు ఐదు లక్షల రూపాయలు) ట్రంప్ డివిడెండ్ పేరుతో అందచేస్తానని డలాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి ఎన్నికల సభలో ప్రకటించటం ట్రంప్ దిగజారు డుతనంతో పాటు అధికార పార్టీ దుస్థితిని వెల్లడిస్తోంది. అది జరుగు తుందో లేదో తెలియదు గానీ ఒకవేళ ఇస్తే గిస్తే 27 కోట్ల మందికి 1.35లక్షల కోట్ల డాలర్లు ఎక్కడి నుంచి తెస్తాడన్నది సమస్య. తాము గెలిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షల రూపాయలు వేయవచ్చని బీజేపీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇదేమిట య్యా అంటే జుమ్లా అని అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం అనేక కబుర్లు చెబుతాం అన్నీ అమలు చేస్తామా అన్నది షా మాటలకు అర్ధం. ట్రంప్ రెండు రోజుల డలాస్ సభలో తొలిరోజు హాలు కొంతభాగం ఖాళీగా ఉన్నట్లు వార్తలొ చ్చాయి. ఇక యథా ప్రకారం ప్రతిపక్ష డెమోక్రాట్లను సోషలిస్టులు, కమ్యూనిస్టులంటూ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ఈ వేదికను కూడా వినియోగించుకున్నారు. గతంలో ఇలాంటి ప్రచారాన్ని ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రమైన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. నోరు తెరిస్తే పచ్చి అవాస్తవాలు, అబద్దాలు చెబుతున్న ట్రంప్ మాటలను విశ్వసించి ఓటర్లు ఐదువేల డాలర్ల ఎరకు లొంగుతారా? కార్మికవర్గం ఏమైనా గానీ తమ, ఆశ్రితులకు ఎంత ప్రయోజనం కలిగిందే లెక్క.
ట్రంప్ తీరు కూడా అలాగే ఉంది, ఇరాన్‌పై దాడులతో జనాల మీద విపరీతమైన భారాలు మోపుతున్నాడు. ఇతర విధానాలతో తన రెండేండ్ల పాలనలో పరువు దిగజారినప్పటికీ తన వ్యాపా రాల ద్వారా ట్రంప్ గణనీయంగా సంపాదించినట్లు తేలింది. ఒక్క 2025లోనే అతగాడి సంపద 220 కోట్ల డాలర్లు పెరిగింది. ఇంకా ఎంతకాలం ఇరాన్ మీద దాడులు, మా జీవితాలను అతలాకుతలం కావిస్తారంటూ రిపబ్లికన్ పార్టీలోని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందనగానే ఎన్నికలు ముగియగానే దాడులు ఆగిపోతాయని ట్రంప్ ప్రకటించాల్సి వచ్చింది. ప్రతి రెండు నిమిషాలకు పదిలక్షల డాలర్ల మేర గృహస్తులపై అదనంగా ఇంథన భారం పడుతున్నట్లు బ్రౌన్ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. బహుశా ఇలాంటి అన్ని రకాల భారాలు మోస్తున్నవారిని ఆకర్షిం చేందుకు ఐదువేల డాలర్ల ఎరవేసినట్లుగా కూడా చెప్పవచ్చు. మరోవైపున తాను విజయం సాధించానని, టెహరాన్‌ను చావుదెబ్బ తీశానని గొప్పలు చెప్పుకొనేందుకు మరోసారి దాడులకు దిగాడు. అమెరికా ఎంతకు తెగించినప్పటికీ ప్రతిఘటన విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గటం లేదు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా దెబ్బకు దెబ్బతీస్తున్నది. మధ్యంతర ఎన్నికలు అవగానే దాడులు ముగుస్తాయని చెబుతున్నప్పటికీ మరోవైపున ట్రంప్ పదవీకాలం పూర్తయ్యే 2029వరకు కొనసాగుతాయనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఆయుధ వ్యాపారులకు లాభాలు సంపాదించి పెట్టే ట్రంప్ వంటి దుర్మార్గులు ఉన్నంతవరకు, వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చేవారు ఉన్నంత కాలం ఇలాంటి దురాగతాలు కొనసాగుతూనే ఉంటాయి !
డోనాల్డ్ ట్రంప్ ఆపదమొక్కులు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



