Thursday, September 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమనువాదులు, చర్రితలో అశోకుడి క్కూడా చోటివ్వలేదు!

మనువాదులు, చర్రితలో అశోకుడి క్కూడా చోటివ్వలేదు!

- Advertisement -

బ్రాహ్మణవాదానికీ-బౌద్ధానికీ జరిగిన సంఘర్షణే మన భారతదేశ చరిత్ర- డాక్టర్‌ ‌బీ.ఆర్‌.అంబేద్కర్‌ వైదిక మత భావజాలం ఉన్న రచయితల కుత్సిత బుద్ధి ఎలా ఉంటుందో మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు. వారు నిజాల్ని దాచేస్తారు. లేదా వక్రీకరిస్తారు తప్ప, ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేయరు. ఉదాహరణకు సర్ ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ ‘ద లైట్ ఆఫ్ ఏసియా’ శీర్షికతో ఒక ఇంగ్లీషు పద్యకావ్యం 1879లో లండన్‌లో ప్రచురించాడు. బుద్ధుణ్ణి ఆయన అలా సంభోదించాడు. అనువాదకులు ఏం చేయాలి? ‘అసియా ఖండపు వెలుగు’ అని రాయాలి కదా? అలా రాయకుండా ‘బుద్ద చరిత్రము’ అని ప్రకటించారు. అంటే, బుద్ధుడికి అంతటి గౌరవం, విలువ ఇవ్వడానికి మనువాదులకు మనస్కరించలేదు. అలాగే అశోకుడి గూర్చి, ఆయన ప్రజారంజకమైన పాలన గూర్చి వైదిక రచయితలు సరిగా రాయలేదు. రాసినా, తగ్గించి అందరి రాజుల్లో ఆయనా ఓ రాజు అన్నట్లు తేల్చేశారు. రోడ్లు వేయించెను, చెట్లు నాటించెను, బాటసారులకు విశ్రాంతి గృహాలు నిర్మించెను వంటివి మాత్రమే రాశారు. కానీ, ఆయన ఎందుకు మహోన్నతుడయ్యాడూ? అంతటి చక్రవర్తి ప్రపంచంలో మరొకరు ఎందుకు లేరూ? వంటి విషయాలు రాయలేక పోయారు. కారణం అశోకుడు ఈ దేశ మూలవాసి కాబట్టి! బయటి నుంచి వలసవచ్చిన ఆర్య సంతతివాడు కాదు కాబట్టి! పైగా, బౌద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు.

బౌద్ధాన్ని జన జీవనంలో ఒక భాగంగా చేసిన అశోకుడిని వారెందుకు కీర్తిస్తారూ? తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చినపుడు మోరియ జాతి శూద్రజాతి-అనీ, వారు దురాచారులనీ చెప్పారు. ఇక్కడి భూమి పుత్రులు స్వంతంగా, స్వతంత్రంగా ఎదిగి, మహా చక్రవర్తులయ్యారని మనువాద రచయితలు ఒప్పుకోలేక పోయారు. అందుకే వారు, మౌర్యుల చరిత్రను కావాలని వదిలేశారు. అయితే, ఆ విషయం బయటపడి చివరకు వారే చులకన అయిపోయారు. అశోకుడి ప్రభను ఎవరూ తగ్గించలేకపోయారు. కారణం-పాత గ్రంథాలు అయిన ఉజ్వల చరిత్రను నమోదు చేసి ఉంచాయి. రాహుల్ సాంకృత్యాయన్ కృషి వల్ల వేల గ్రంథాలు మళ్లీ భారత దేశానికి చేరాయి. ముఖ్యంగా చెప్పుకోవలసి వస్తే, అశోకావదానం, విశుద్దమగ్గ, దీపవంశ, మహావంశ, సమంత వినీదికా, కుణాళావధానం, అశోక రాజసూత్రం, అశోక వినీతావధానం, అశోక రాజావధానం వంటి ఎన్నో గ్రంథాలు అశోకుని చరిత్రనంతా నమోదు చేశాయి. అశోకుడి వ్యక్తిత్వం, అయనలో వచ్చిన మార్పు, బౌద్ధ సేవ, ఔదార్యం, పాలనా సామర్థ్యం, ఇంకా మౌర్యవంశం ఉచ్ఛస్థితి, పతనం వంటివన్నీ ఆ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అవి ప్రపంచ భాషల్లోకి, భారతీయ భాషల్లోకి అనువాద మయ్యాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపలేరన్నట్టు అశోకుణ్ణి మనువాదులు మరుగు పరచలేకపోయారు.

బౌద్ధం మీద వారు ఎంతటి క్రూరమైన దాడులు జరిపినా, బౌద్ధాన్ని నాశనం చేయలేకపోయారు కదా? ఛండాశోకుడిగా ఉన్న అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ధర్మాశోకుడిగా మారాడు అనేది అందరికీ తెలిసిందే! అయితే, అంతటి విధ్వంసంలో కూడా కళింగ ప్రాంతపు బౌద్ధులు శత్రుసేనల పట్ల అంటే – అశోకుడి సేనలపట్ల చూపిన ఔదార్యానికి అశోకుడి మనసు కరిగిపోయింది. ఆయనలో మార్పునకు ఇది కూడా ఒక కారణం – ఈ కళింగ బౌద్ధులలో అధికశాతం తెలుగు వారు కూడా ఉన్నారు. కాబట్టి, అశోకుడి పరివర్తనకు తెలుగు బౌద్ధులు కూడా కారణమయినట్టే- సాధారణ శకానికి ముందు 260 బిసిఇలో యశస్సుడు, పిండోల భరధ్వాజుడు, సముద్రుడు వంటి భిక్షవుల సమక్షంలో ఉపగుప్తుని ద్వారా అశోక చక్రవర్తి విజయదశమి రోజున బౌద్ధం స్వీకరించాడు. అప్పటినుంచి ఈ దేశ ప్రజలు ఆ రోజును ‘అశోక విజయ దశమి’గా పరిగణిస్తున్నారు, అయితే, బౌద్ధం స్వీకరించకముందే- పరిపాలనలో తనకు ఏదైనా సమస్య ఎదురైతే, అశోకుడు యశస్సుడనే భిక్షవు సలహాలు తీసుకునేవాడు. బౌద్ధం ఏ విధంగా జనహితమో అన్నది కూడా అప్పు డప్పుడు ఆయనతో చర్చిస్తూ ఉండేవాడు. ఒకసారి ఉపగుప్తుని వెంటతీసుకుని తన సామ్రాజ్యంలోని బౌద్ధస్థలాలు పర్యటించి విషయాలు ఆకళింపు చేసుకున్నాడు కూడా! ఇలాంటి విషయాలు మహావంశంలో నమోదై ఉన్నాయి.

బౌద్ధద్ధమ్మంలో 84 వేల సుత్తాలున్నాయని మొగలిపుత్త తిస్స ద్వారా తెలుసుకున్న అశోకుడు, బుద్ధుని ధాతువుల్ని సేకరించి, వాటిని భాగాలుగా విడగొట్టి, వాటి పై 84 వేల స్థూపాల్ని తన సామ్రాజ్యమంతటా నిర్మించాడు. అందువల్ల, అశోకుడు నిర్మించిన ఏ స్థూపమైనా అది బుద్ధుడి ధాతువులపై నిర్మించిందేనని పరిశోధకులు ధృవీకరించారు. ఇవి మాత్రమే కాకుండా చైత్యాలు, రాతి స్తంభాలు, గుహారామాలు, కూడా వేల సంఖలో నిర్మించాడు. భిక్షువుల్ని విదేశాలకు పంపి, అక్కడ బౌద్ధాన్ని ప్రచారం చేయించాడు. నిజానికి బుద్ధుడి కాలం నాటి కంటే కూడా బౌద్ధం అశోకుడి కాలంలోనే విస్తృతంగా ప్రచారమైంది. ప్రపంచ వ్యాప్తమైంది. బౌద్ధ ప్రచారంలో ఆయనది అవిశ్రాంత కృషి! జంబూద్వీపమంతటిని పాలించిన అశోకుణ్ణి మించిన చక్రవర్తి ప్రపంచంలోనే మరొకరు లేరు- అని అంటే అది అతిశయోక్తి కాదు. సుమారు 50 లక్షల కి.మీ.లకు మించిన సువిశాలమైన ప్రాంతం – అంటే, ఇప్పటి మన భారత దేశంతో పాటు, ఇరాన్ సరిహద్దు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కశ్మీర్, నేపాల్, బర్మా. శ్రీలంకలో కొంత భాగాన్ని కలిపి మొత్తాన్ని 42 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించినవాడు అశోక చక్రవర్తి. ఈ దేశ మూలాలున్న సిసలైన భారతీయుడు. అభివృద్ధిని పరుగులు పెట్టించినవాడు. అశోకుని తాత చంద్రగుప్త మౌర్యుడు 322 బిసిఇలో భారత దేశానికి చక్రవర్తి అయిన నాటి నుంచి చివరిరాజు బృహద్రత మౌర్యుని వరకు అంటే- 185 బిసిఇ వరకు సుమారు 42 ఏండ్లు సుదీర్ఘ కాలం పాటు ప్రజాపాలన అందించాడు.

అతి విశాలమైన పెద్ద రాజ్యాన్ని ఏలడమే కాదు, ఎక్కువ కాలం పాలించిన ఏకైక చక్రవర్తి. ప్రజలందరూ తన బిడ్డలేనని భావించాడు. ప్రజా సంక్ష‍ేమ పాలనకు రూపకల్పన చేసినవాడు. మిగులు ధనాన్ని నేరుగా ప్రజలకు అందించిన వాడు. కోశాగారాన్ని ప్రజలకు పంచి ధర్మనిరతిగల చక్రవర్తిగా పేరుగాంచాడు. ద్దమ్మమే సమస్త జీవకోటిని రక్షిస్తుందన్న బుద్ధుడి సందేశాన్ని తను పాటిస్తూ, ఆ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడమేకాదు, అందుకు తన కుటుంబాన్ని కూడా వినియో గించాడు. ప్రజలందరూ మానవీయ విలువలు పాటించాలన్న నియమాన్ని చట్టబద్దం చేశాడు గనక, సమాజం నైతికంగా ఎదగగలిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది జంతు బలుల నిషేధ చట్టం. మనుషులతో పాటు, పశువులకు కూడా చికిత్సాలయాలు ఏర్పరచడం, గంగానదితో పాటు అనేక నదుల శుభ్రతకు చర్యలు చేపట్టడం వంటివి అంతకుముందు ఏ రాజూ చేయని తొలి ప్రయత్నాలు. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చిన చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. వీటన్నిటి వెనక బౌద్ధధమ్మ ప్రభావం బలంగా ఉంది . బౌద్ధధమ్మ సూత్రాలను, తన పరిపాలనా విధానాలను ప్రజల భాషలో శిలలపై చెక్కించి- శాసనాలు ప్రజలకు అందు బాటులో ఉంచాడు. ఒక రకంగా అది అనాటి రాజ్యాంగాన్ని ప్రజలకు చేరువ చేయడం! తను రాజుగా ఉన్న 42 ఏండ్లలో సుమారు ఇరవై ఐదు సార్లు ఖైదీలను క్షమించి విడుదల చేశాడు. నేరగాళ్లలో గణనీయమైన పరివర్తన రావడం వల్ల, కారాగారాల అవసరం లేదని.. వాటిని కూలగొట్టించాడు.

ఈ విషయం ఆయన వేయించిన ఐదవ శిలా శాసనం చెప్తుంది. నేరాలు లేని రాజ్యంగా తీర్చిదిద్దడ మంటే మాటలు కాదుగదా? ప్రపంచంలో మరే ఇతర చక్రవర్తీ ఇంత జనరంజకంగా పరిపాలించినట్టు ఆధారాలు లేవు. అంతేకాదు, తన సామ్రాజ్య సంపదను శరవేగంగా పరుగులు తీయించి, ఆయన పాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా మార్చాడు. ఈ విషయాన్ని వక్రీకరించి, వైదిక రచయితలు గుప్త రాజుల కాలాన్ని స్వర్ణయుగమని ప్రచారం చేశారు. చివరి మౌర్య చక్రవర్తి బృహద్రతుని తర్వాత. అతని సేనాని పుష్యమిత్ర శృంగుడు – శృంగ వంశస్థాపన చేశాడు. బౌద్ధాన్ని దెబ్బతీయాలన్న కుట్రతోనే అదే కాలంలో రామాయణ, మహాభారతాలు – మనుస్మృతీ రాయబడ్డాయని నిరూపించబడింది. ‘పుషమిత్ర శృంగుడే- రామాయణంలోని రాముడని’ రాహుల్ సాంకృత్యాయన్ వంటి మహా పండితుడే స్పష్టం చేశాడు. ఆయన రచన ‘ఓల్గాసే గంగా’ చదివిన వారికి ఈ విషయం తప్పకుండా తెలుస్తుంది. ఇక ఈ వైదిక పండితులు చేసిన నిర్వాకం మరొకటి కూడా ఉంది. అశోకుడి జన్మదినాన్ని శ్రీరామ నవమిగా మార్చి జనం మీద రుద్దారు. వారు సృష్టించిన ఎన్నో అబద్దపు పండగలలో దీన్ని కూడా చేర్చారు. వాస్తవమేమంటే చైత్ర శుక్ల అష్టమి రోజున అంటే-రామ నవమికంటే ఒక రోజు ముందు అశోక చక్రవర్తి పుట్టినరోజు వస్తుంది. దాన్ని మరుగు పరచడానికి, శ్రీరాముడి పుట్టిన రోజు రామ నవమిని మనముందు పెట్టారు. రాముడు చారిత్రక పురుషుడు కాదు. కాల్పనిక రచనలో ఒక పాత్ర-అంతే! బుద్ధుడైనా, అశోకుడైనా కల్పించిన పాత్రలు కారు. వాస్తవంగా ఈ దేశంలో పుట్టి పెరిగిన చారిత్రక పురుషులు.

ఆ తేడాను గమనించుకోవాలి! దార్శనికుడైన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడ్డ మన భారత తొలి స్వతంత్ర, ప్రజాస్వామ్య ప్రభుత్వం బౌద్ధ చిహ్నాల్ని, అశోకుడి చిహ్నల్ని అధికారికంగా స్వీకరించింది. బుద్ధుడి ధమ్మచక్రం మన జాతీయ పతాకంలో చేరింది. సారనాథ్‌లో అశోకుడు స్థాపించిన ఏకశిలా స్తంభం మీద గల నాలుగు సింహాలు మన దేశ అధికార ముద్రగా మారింది. రాష్ట్రపతి భవన్ దర్బార్‌హాల్‌లో ని‌లువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించుకున్నాం. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నా యీ? ఇది కాల్పనిక పాత్రలయిన రాముడి దేశమో, కృష్ణుడి దేశమో కాదు మన చారిత్రక పురుషులైన బుద్ధుడి దేశము, అశోకుడి దేశమూ.. అని చెప్పకనే చెపుతున్నాయి. ఆ వారసత్వాన్ని నిలుపుకుంటూ, స్వేచ్ఛా సమానత్వాలతో ఒకప్పుడు శీల ప్రధానమైన దేశంగా వెలసిల్లిన ఈ దేశాన్ని, మళ్లీ ఆ దశకు, ఆస్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాబోయే తరాలదే! ఇక ఇప్పుడు కావల్సింది రామరాజ్యం కాదు, అశోకుడి రాజ్యం!!​ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -