Thursday, September 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజాప్రతినిధులారా... ముందు రాజకీయాలను శుద్ధి చేయండి!

ప్రజాప్రతినిధులారా… ముందు రాజకీయాలను శుద్ధి చేయండి!

- Advertisement -

ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన తెలంగాణ చట్టసభలు ఇటీవలి పరిణామాలతో ఆందోళనలకు, ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు వేదికలుగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ విభేదాలు సహజమే. కానీ, ఆ విభేదాలు ప్రజాస్వామ్య హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం, కుల దురహంకారం వరకు వెళ్లడం ఆందోళనకరం. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మె ల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలతో ఆ పార్టీ చేపట్టిన ఆందోళన, నల్ల టీషర్టులతో అసెంబ్లీ ప్రాంగణం వైపు వెళ్లే ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. నిండు సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టుకోవాల్సి రావడం చట్టసభల గౌరవానికి తగిన పరిణామం కాదు. స్పీకర్‌ పదవి వ్యక్తిగత రాజకీయాలకు అతీతమైన రాజ్యాంగబద్ధ స్థానం. ఆ స్థానాన్ని అవమానించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థనే అవమానించడం.అదే సమయంలో ఎమ్మెల్సీ నవీన్‌‌కుమార్‌‌రెడ్డి వ్యవహరించిన తీరు కూడా హుందాగా లేదని విమర్శలు.

దీనికితోడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరణాన్ని కోరుకుంటున్నామంటూ షాద్‌‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ సంస్కృతిపై ప్రశ్నలు లేవనెత్తాయి. రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేయవచ్చు. విధానాలను ఎండగట్టవచ్చు. కానీ ఒక ప్రజాప్రతినిధి మరొక రాజకీయ నాయకుడి మరణాన్ని కోరుకోవడం ప్రజాస్వామ్య రాజకీయాల స్థాయిని దిగజార్చడమే. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ వద్ద జరిగిన పరిణామాలు ఈ రాజకీయ వైషమ్యాన్ని మరింత తీవ్రం చేశాయి. అక్కడ కాంగ్రెస్‌ నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఉద్రిక్తత, తోపులాట అనంతరం పసుపు నీళ్లతో ఆ ప్రదేశాన్ని “శుద్ధి” చేయడం మరింత తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఎవరు ఏ కులానికి చెందినవారైనా, వారు నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయాలనే ఆలోచన ఆధునిక ప్రజాస్వామ్య సమాజానికి ఎంతవరకు సరిపోతుంది? ఇది కేవలం ఒక రాజకీయ పార్టీపై విమర్శ కాదు,కుల వివక్ష, అంటరానితనం, మనువాద భావజాలం వంటి సామాజిక అవశేషాలపై ఆలోచించాల్సిన సందర్భం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 చట్టం ముందు అందరూ సమానులని చెబుతుంది. ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అలాంటి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులే కుల ఆధారిత “శుద్ధి” వంటి చర్యలకు పాల్పడితే అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎదుర్కొన్న అవమానాలు కులవివక్ష ఎంత అమానుషమో చరిత్ర మనకు గుర్తుచేస్తూనే ఉంది. అందుకే పసుపు నీళ్లతో నేలను శుద్ధి చేయడం కాదు-కుల వివక్ష నుంచి మనసులను, అజ్ఞానం నుంచి మెదళ్లను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మొత్తం రాజకీయ రగడలో అసలు ప్రజా సమస్యలు ఎక్కడ? ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగింది? ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి? దళితులకు ఇచ్చిన హామీలు ఎక్కడ నిలిచాయి? గత ప్రభుత్వం ప్రకటించిన మూడెకరాల భూమి, దళిత ముఖ్య మంత్రి, దళిత బంధు వంటి హామీలపై కూడా సమగ్ర సమీక్ష జరగాలి. కాంగ్రెస్‌ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌లోని ఎస్సీ, ఎస్టీ హామీల అమలు పరిస్థితిపైనా సభలో చర్చ జరగాలి. అంబేద్కర్‌ అభయ హస్తం, ఎస్సీ కార్పొరేషన్‌, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు, అసైన్డ్‌ భూముల సమస్యలు వంటి అంశాలు శాసనసభలో ప్రధాన చర్చాంశాలుగా మారాలి.

119 మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నది ఒకరినొకరు దూషించుకోవడానికి కాదు. కోట్లాది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి. అధికారపక్షం తన హామీల అమలుపై సమాధానం చెప్పాలి. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలి. వ్యక్తిగత దూషణలకు బదులు విధానాలపై చర్చ జరగాలి. సభా సమయం వృథా కాకుండా ప్రజా సమస్యలకు వినియోగించాలి. రాజకీయ ప్రత్యర్థి నడిచిన నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వెనుక ఉన్న ఆలో చనను ప్రశ్నించాల్సిన సమయం ఇది. కులం పేరుతో మనిషిని తక్కువ చేసి చూసే భావజాలం ఏ రూపంలో వచ్చినా అది రాజ్యాంగానికి విరుద్ధమే. ప్రజాప్రతినిధుల నోట బూతులు రావడం ఎంత తప్పో, వారి చేతుల్లో కులవివక్షకు ప్రతీకలైన చర్యలు జరగడం కూడా అంతే తప్పు. అసెంబ్లీ గోడల మధ్య వినిపించాల్సింది వ్యక్తిగత దూషణలు కాదు-ప్రజల గొంతుక. సభా సమయాన్ని రాజకీయ కక్షలకు కాకుండా ప్రజల సమస్యలకు కేటాయించాలి. దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, కార్మికుల జీవితాలను మార్చే నిర్ణయాలపై చర్చ జరగాలి. తెలంగాణ అసెంబ్లీ మళ్లీ హుందాతనాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టుకోవాలి. కుల దురహంకారానికి, అంటరానితనానికి, మనువాద భావజాలానికి చట్టసభల్లో స్థానం ఉండకూడదు. పసుపు నీళ్లతో నేలను శుద్ధి చేయడం కాదు… జ్ఞానంతో మెదళ్లను శుద్ధి చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.

టి.స్కైలాబ్ బాబు, 9177549646

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -