మహిళా రెజ్లర్ల వేధింపుల కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ : భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బిజెపి మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు క్లీన్‌చిట్ లభించింది. బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఏమీ లేవని, వేధింపులు జరిగిన తర్వాత ఫిర్యాదు చేయటంలో ఆలస్యం, వేధింపుల అనంతర కాలంలో బాధితుల వ్యవహారశైలి, ప్రధాన అంశాలపై విరుద్ధ సాక్ష్యాలు సహా నిలకడలేనితత్వంతో బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను ఈ కేసులో నిర్దోషిగా తేల్చుతూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన తరఫున న్యాయవాది రాజీవ్ మోహన్ తెలిపారు.
ఓ మైనర్ రెజ్లర్ సహా మహిళా క్రీడాకారిణిలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు బెదిరించిన ఉదంతంపై 2023లో దేశ రాజధానిలో దుమారమే రేగింది. భారత అగ్రశ్రేణి రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టగా.. న్యాయస్థానం జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై క్రీడాశాఖ సైతం ఓ కమిటీని వేసినా.. ఆ కమిటీ నివేదిక బయటకు రాలేదు. పలు సెక్షన్ల కింద బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై కేసు నమోదవగా, పోలీసులు 1000 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2025లో మైనర్ రెజ్లర్ కేసులో పోలీసులు ప్రత్యేక చార్జ్‌షీట్ దాఖలు చేసినా.. ఆ తర్వాత ఆ కేసులో ఆధారాలు లేవని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ నేరం చేశాడనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ట్రయల్ కోర్టు భావించిన నేపథ్యంలో… ఆది నుంచి ఈ కేసులో ఒక వైపు నుంచే దర్యాప్తు చేస్తున్నారని ఆరోపిస్తూ బ్రిజ్‌భూషణ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఢిల్లీ కోర్టు చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ర్టేట్ (ఏసీజెఎం) అశ్విని పన్వార్.. బ్రిజ్‌భూషణ్ నిర్దోషి అంటూ తీర్పు వెల్లడించింది.
అప్పీల్‌కు వెళతాం : వినేశ్ ఫోగట్
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్ సింగ్ నిర్దోషి అంటూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపింది. ‘మహిళా రెజ్లర్లను వేధించిన కేసులో ఢిల్లీ కోర్టు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను అపరాధిగా చూడనందుకు ఎంతో బాధపడుతున్నాం. మొదటి నుంచి ప్రభుత్వం, అధికారులు, వ్యవస్థ బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను కాపాడేందుకు పని చేస్తున్నాయి. ఈ కేసులో వాంగ్మూలం వెనక్కి తీసుకోవాలని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా, మహిళా రెజ్లర్ల గట్టిగా నిలబడి న్యాయపోరాటం కొనసాగిస్తాం. ఢిల్లీ కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని న్యాయవాదులకు సూచించాం. త్వరలోనే అప్పీల్ దాఖలు చేస్తాం. రెజ్లర్ల పోరాటం కొనసాగుతుందని’ వినేశ్ ఫోగట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
బ్రిజ్‌భూషణ్ నిర్దోషి
- Advertisement -
- Advertisement -



