Saturday, August 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది

ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది

- Advertisement -

ప్రశ్న జ్ఞాన సముపార్జనకు మూలం. తరగతి గదిలో విద్యార్థి వేసే ప్రశ్న నుంచి ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టే ప్రశ్న వరకు దాని ప్రాధాన్యం ఎంతో ఉంది. ప్రశ్నించడం ద్వారా తప్పులను గుర్తించగలం, కొత్త ఆలోచనలకు అవకాశం కలుగుతుంది. కానీ ప్రశ్నించేవాడిని శత్రువుగా చూసే ధోరణి పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. చట్టసభల్లో ప్రశ్నోత్తరాల సమయం అందుకే ఎంతో ముఖ్యమైనది. ప్రజల తరఫున సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సమస్యలపై సమాధానాలు రాబట్టడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ప్రశ్నించే అవకాశం లేకపోతే అధికారపక్షం తన సంఖ్యాబలంతో నిర్ణయాలను బుల్డోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రశ్న పాలకులను ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు సభలకు, సమావేశాలకు, విలేకరుల సమావేశాలకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దేశ ప్రధానమంత్రి కొన్నేళ్లుగా విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శ ఉంది. నార్వే పర్యటనలో విలేకరి ప్రశ్నలు అడగబోతున్న సమయంలో ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మొదటి రోజు హాజరై తరువాత సమావేశాలకు దూరంగా ఉండటం కూడా ప్రశ్నలకు భయపడుతున్నారనే విమర్శలకు కారణమైంది.

జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, మేకులతో కూడిన లాఠీలతో దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎవరి ఆదేశాలతో ఈ చర్యలు జరిగాయనే ప్రశ్న పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. ప్రధాని, హోంమంత్రి సభకు హాజరు కాకపోవడంతో ఈ ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి కిరణ్ రిజిజు సభ్యులను సమాధానపరచడానికి ప్రయత్నించడం కూడా గమనార్హంగా మారింది. ముఖ్యమైన బిల్లులు సభలో ఆమోదం పొందాల్సి ఉన్న సమయంలో కీలక మంత్రులు సభకు దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని బిల్లులపై సమగ్ర చర్చ జరగలేదనే విమర్శలు వచ్చాయి. విదేశీ నిధుల నియంత్రణ బిల్లును పార్లమెంటరీ కమిటీకి అప్పగించడం కూడా జరిగింది. సాధారణంగా సంఖ్యా బలంతో బిల్లులను ఆమోదించుకునే అధికారపక్షం, బయట జరుగుతున్న ప్రజా నిరసనల కారణంగా కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి సమస్యలపై యువత దేశ రాజధానిలో నిరసనలు వ్యక్తం చేయడం కూడా ప్రశ్నించే స్వభావానికి ప్రతీక. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత ఉండాలని యువత కోరుతోంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యుడైన మంత్రి ముందే రాజీనామా చేసినా, సమస్యపై యువత ప్రశ్నలు కొనసాగాయి. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారిపై ముద్రలు వేయడం సమస్యను పరిష్కరించదు. ఇదే సందర్భంలో ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని ప్రస్తావించడం చర్చకు దారితీసింది. సమాజంలో జరిగే అన్యా యాన్ని, అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే వారిని ఉద్దేశించేలా ఈ పదాన్ని ఉపయోగించడంపై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతి ఆలోచనాపరుడినీ ఇలాంటి ముద్రతో చూడటం ప్రజాస్వామ్యానికి ఎంతవరకు అనుకూలమనే ప్రశ్న తలెత్తింది. గతంలో ‘అర్బన్ నక్సల్స్’ అనే పదాన్ని ఉపయో గించినట్లే ఇప్పుడు ప్రశ్నించే ప్రతి ఆలోచనా పరుడినీ ‘దిమాగీ నక్సల్’గా ముద్ర వేయడం ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో నేరం కాదు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత తమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి సమస్యలను వినాలి.

ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడటం ప్రారంభిస్తే చివరకు ప్రశ్నించే హక్కే ప్రమాదంలో పడుతుంది. నేటి యువత సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంది. తమ అసంతృప్తిని కొత్త రకాలుగా వ్యక్తం చేస్తోంది. ‘దిమాగీ నక్సలైట్’ అనే పదానికి నిరసనగా ఆన్‌లైన్‌లో కొత్త రాజకీయ వేదిక ఏర్పడటం, దానికి పెద్ద సంఖ్యలో అనుచరులు రావడం కూడా యువతలోని స్పందనకు ఒక ఉదాహరణ. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తున్నారని ఈ పరిణామాలు గుర్తుచేస్తున్నాయి. ఇంత పెద్ద దేశంలో భావ సంఘర్షణ సహజం. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, విధానాలను విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రజలు న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనం కోరుతున్నప్పుడు వారి డిమాండ్లను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నిరసనలకు కారణమైన సమస్యలను పరిష్కరించకుండా నిరసనకారులపైనే ముద్రలు వేయడం వల్ల అసంతృప్తి మరింత పెరిగే అవ కాశం ఉంది. ప్రశ్నే ప్రజాస్వామ్య సౌధానికి పునాది. ప్రశ్నించే హక్కును కాపాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే.

శ్రీ శ్రీ కుమార్, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -