25 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం
సిట్ ఏర్పాటు చేస్తాం: సీపీ సజ్జనార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో ఆహార కల్తీకి పాల్పడుతున్న ముఠా గుట్టును ‘హెచ్-ఎఫ్‌ఏఎస్‌టీ’ బృందాలు రట్టు చేశాయి. 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముగ్గురిని అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని సీసీసీలో మంగళవారం విలేకరుల సమావేశంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి సీపీ సజ్జనార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాటేదాన్‌కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్‌కు చెందిన విశాల్ సన్వార్, దులీచంద్ కచ్చవా ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని మసాలాలను కల్తీ చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఎఫ్‌ఏఎస్‌టీ’ జీహెచ్ఎంసీ) ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి ప్రత్యేక నిఘా వేశారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు 13 మసాలా వ్యాపార సంస్థల్లో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్ తోపాటు ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్‌తో మసాలాలు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన టన్నులకొద్దీ మసాలా దినుసులను తెలుగు రాష్ట్రాలకు ఈ ముఠా సరఫరా చేస్తోంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్ లు, నెయ్యి , ఆయిల్, పౌడర్లుతోపాటు వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాలను కల్తీ చేశారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా మార్చి విక్రయిస్తున్నారు. ‘హెచ్-ఎఫ్‌ఎస్‌టీ’ ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి.. 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 246 టన్నుల కల్తీ ఆహారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపారు. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. కల్తీ ఆహారం తయారు చేస్తున్నా లేదా అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నా, వెంటనే ‘డయల్ 100’ ద్వారా గానీ, లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ నంబర్ 8712661212 (కాల్ లేదా వాట్సాప్) ద్వారాగానీ సమాచారం అందించాలని సీపీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తి రహస్యంగా ఉంచుతామన్నారు. కల్తీ ఆహారం వల్ల కాలేయం, మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉంది. క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో ఇన్‌స్పెక్టర్లు రంజిత్, అంజయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్లు శంకర్, కృష్ణ, అఖిల్ తోపాటు హెచ్-ఎఫ్‌ఏఎస్‌టీ బృందం పాల్గొన్నారని, వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
కల్తీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



