– నాసిరకం పనుల పై తీవ్రంగా మండిపడుతున్న గ్రామస్తులు
– లక్షల నిధులు నీటి పాలు.. పట్టించుకొని అధికారులు
నవతెలంగాణ – కుభీర్ : మండల కేంద్రంలోని మేదరి కాలనీ నుంచి ఆస్పత్రి ముందుగా ఉన్న పెద్దవాగు వరకు ఉపాధిహామీ పథకం కింద రూ.76 లక్షలతో చేపట్టిన మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తికాకముందే కూలిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిర్మాణ పనుల నాణ్యతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
మేదరి కాలనీ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా మురికి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయడంతో కాలనీ వాసుల్లో ఆశలు చిగురించాయి. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచే నాణ్యత లోపించిందని, పలుమార్లు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్కు సూచించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే కాలువకు సంబంధించిన ఓ పక్క గోడ కూలిపోవడంతో పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కోసం మంజూరైన భారీ నిధులను కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి వదిలేస్తే పనుల పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా సమస్యను పరిశీలించి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులకే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో జరుగుతున్న పనుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మాణ నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ట్రాక్టర్ తగలడంతోనే గోడ కూలింది : ఏపీవో
ఈ విషయమై ఉపాధిహామీ ఏపీవో హరిలాల్ను వివరణ కోరగా.. మురికి కాలువ గోడ పక్కన మొరం తరలించే క్రమంలో ట్రాక్టర్ తగలడంతో సైడ్ గోడ కూలిపోయిందని తెలిపారు. అయితే నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేకంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.



