నవతెలంగాణ-హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ సంఘటన జమ్మూ నగర శివార్లలోని గంగ్యా ప్రాంతంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి కాన్వాయ్‌కి చెందిన స్పీడింగ్ స్కార్పియో వాహనం ఢీకొని భరత్ కాపర్ (55) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన భరత్, స్థానిక షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 9:05 గంటల సమయంలో ఆయన సాధారణంగా రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఉప ముఖ్యమంత్రిని ఆయన నివాసం వద్ద దింపి తిరిగి వస్తుండగా ఈ వాహనం బాధితుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ కిందకు దిగి, తీవ్రంగా గాయపడిన భరత్‌ను తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆస్పత్రికి చేరుకునేసరికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.



