నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. నీట్ పరీక్ష సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాష్ట్రాల హక్కులకు విరుద్ధమని పేర్కొంటూ, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి కె. అరుణ్‌రాజ్ శాసనసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి డీఎంకే, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ చర్యను వ్యతిరేకిస్తూ బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకౌట్ చేశారు. “నీట్ సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకం” అని అసెంబ్లీలో అరుణ్‌రాజ్ అన్నారు.
అదే విధంగా ఇటీవల కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026ను వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసనసభ మంగళవారం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపాదిత చట్టాన్ని ప్రస్తుత రూపంలో ఉపసంహరించుకోవాలని మంత్రి రాజ్‌మోహన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, అంతర్జాతీయ సహాయాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని, అయితే దీనిలోని నిబంధనలు మైనారిటీ సంస్థలు నడుపుతున్న విద్యాసంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపనుందని రాజ్‌మోహన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (FCRA)కు ప్రతిపాదిత సవరణల వల్ల, విదేశీ విరాళాలు అందుకుంటున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ గృహాలు, ఇతర సంస్థలపై ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు.



