తెలంగాణ జైళ్ల చరిత్రలోనే తొలిసారి
ఉత్తీర్ణత సాధించిన ఖైదీలకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అభినందన సర్టిఫికెట్ల ప్రదానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఎన్ఐఓఎస్ ద్వారా 78 మంది ఖైదీలు ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల విద్య, పునరావాసం, సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో బుధవారం సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన ఖైదీలకు తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఖైదీలు చూపిన పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను అధిగమించాలనే సంకల్పాన్ని ప్రశంసించారు. ఇదే పట్టుదలతో విద్యను కొనసాగిస్తూ, గౌరవప్రదమైన, మెరుగైన భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. విద్య, స్వీయాభివృద్ధి, పునరావాసం దిశగా ముందుకు సాగుతున్న ఇతర ఖైదీలకు కూడా ఇది ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. (సెంట్రల్ ప్రిజన్) చర్లపల్లి నుంచి 56 మందితోపాటు(సెంట్రల్ ప్రిజన్) నిజామాబాద్ నుంచి 15 మంది, (స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్) హైదరాబాద్ నుంచి ఏడుగురు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఖైదీలకు భవిష్యత్‌లో ఉపాధి, జీవనోపాధికి ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలను ఎంపిక చేశామన్నారు.
ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఇఓ) నైపుణ్యాలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చినట్టు తెలిపారు. సీనియర్ సెకండరీ (10+2) విద్యను కొనసాగించేలా ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. 10+2 పూర్తి చేసిన అనంతరం వారు చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ బీఏ కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంటుందని, అవకాశాలను సద్వినియోగం చేసుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణలోని జైలు ఖైదీలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో సహకరిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌కు డా. సౌమ్య మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. మాజీ (ఎస్‌ఐఓఎస్) రీజినల్ డైరెక్టర్ పరంప్రీత్ సింగ్, ఎన్ఐఓఎస్ రీజినల్ డైరెక్టర్ డా. ప్రవీణ్ చౌహాన్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని అభినందించారు.
న్యాయవాదిగా మారుతా..
ఈ సందర్భంగా పలువురు ఖైదీలు తమ అనుభవాలను పంచుకున్నారు. విద్య లేకపోవడం వల్ల తమ జీవితాల్లో ఎదురైన ఇబ్బందులను వారు వివరించారు. చదువు లేకపోవడం కారణంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని, సమాజంలో తగిన గౌరవం లభించలేదని తెలిపారు. ఒక ఖైదీ భవిష్యత్‌లో ఎల్ఎల్బీ వరకు చదివి న్యాయవాదిగా మారి పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మరో ఖైదీ చిన్ననాటి నుంచే సరైన విద్య అందించి ఉంటే తన జీవితం మరోలా ఉండేదని, బహుశా తాను జైలుకు వచ్చే పరిస్థితి ఏర్పడి ఉండకపోయేదని అన్నారు.
ఖైదీల చదువు కోసం ఎన్‌ఐఓఎస్‌తో ఎంఓయూ..
ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్సెస్సీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఏంఓయూ అనంతరం సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి; సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్; స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుంచి మొత్తం 108 మంది ఖైదీలు ఎస్సెస్సీ (10వ తరగతి) కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఖైదీల చదువుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతోపాటు, అవసరమైన చోట అదనంగా ప్రయివేటు ఉపాధ్యాయులను కూడా నియమించారు. వీరి వేతనాలను తెలంగాణ జైళ్ల శాఖ భరించింది. సంబంధిత జైళ్లలోని అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల(ఖైదీలు) చదువును నిరంతరం పర్యవేక్షిస్తూ, మార్గనిర్దేశం చేశారు. సంవత్సరంపాటు క్రమబద్ధమైన విద్యా ప్రణాళికలో భాగంగా రెగ్యులర్ తరగతులు, మాక్ టెస్టులు, ప్రీ-బోర్డ్ పరీక్షలు నిర్వహించి ఖైదీలను పరీక్షలకు సిద్ధం చేశారు. దాంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 78 మంది ఖైదీలు ఎస్సెస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఇన్చార్జి (ఎన్‌ఐఓస్) పరంప్రీత్ సింగ్, రీజినల్ డైరెక్టర్, డా. ప్రవీణ్ చౌహాన్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ వై.రాజేష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డా. డి.శ్రీనివాస్, చర్లపల్లి సూపరింటెండెంట్ డి. భారత్, ఎస్పీడబ్ల్యు సూపరింటెండెంట్, పి. అశోక్ కుమార్, ఖైదీలు పాల్గొన్నారు.



