రికార్డుస్థాయి వరి ఉత్పత్తి అంటూ కేంద్రం ప్రచారం
మార్కెట్లో మాత్రం కొరత.. బియ్యం మరింత ప్రియం
దేశంలో 10-13 శాతం పెరిగిన ధరలు
బలహీన రుతుపవనాలు, ఎంఎస్‌పీ ఎఫెక్ట్
ముందస్తు చర్యల్లో మోడీ సర్కారు విఫలం
సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లు
ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్,
నిత్యావసరాల ధరలతో విలవిల
దేశంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అవుతుందని కేంద్రం చెప్తున్నప్పటికీ.. వాస్తవంలో అందుకు విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో వరి కొరత కనిపిస్తోంది. బలహీన రుతుపవనాలు, పంటల మధ్య సరఫరా అంతరం, కంటి తుడుపుగా మారిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), తగ్గుతున్న వరి నిల్వలు, ఇథనాల్ తయారీకి బియ్యంపై పెరుగుతున్న డిమాండ్ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుల భోజన పళ్లెం పైనా ద్రవ్యోల్బణ భారం మరింత పెరుగుతోంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బియ్యం ధరలు గత కొన్ని వారాల్లో పది శాతానికి పెరిగాయి. ముఖ్యంగా సోనా మసూరి, పొన్ని, మసూరి వంటి ప్రీమియం నాన్-బాస్మతి రకాల ధరలు గణనీయంగా పెరుగుదలను నమోదు చేశాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని చెప్తున్నప్పటికీ.. మార్కెట్‌లో వరి కొరత, బలహీన రుతుపవనాలు, సరఫరా సమస్యలు ధరలను నియంత్రించలేకపోతున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కారుకు ముందు చూపు లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యానికి సామాన్యుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. దేశంలో 2025-26లో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రైస్ మిల్లర్ల వద్ద వరి నిల్వలు తగ్గిపోయాయనీ, మార్కెట్‌లో సరఫరా ఒత్తిడి నెలకొందని పరిశ్రమ వర్గాలే చెప్తున్నాయి. కేంద్రం చెప్తున్నట్టుగా దేశంలో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలోనే ఉంటే.. ధరలు ఎందుకు పరుగులు పెడుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వినియోగదారుడిపై భారం
2026-27 ఏడాది పంటకు కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2369 నుంచి రూ.2,441కు పెంచింది. రైతులకు ఇది కేవలం కంటి తుడుపు చర్యే. అయితే దేశంలో ధరల నియంత్రణకు మోడీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దీంతో చివరకు వినియోగదారులైన సాధారణ ప్రజలే అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్, ఇతర నిత్యవసరాల ధరలతో సతమతమవుతున్న వారికి.. ఈ పరిణామం మరింత భారంగా మారనుంది.
ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎక్కడ
ఈ ఏడాది రుతుపవణాలు ఇప్పటి వరకు సాధారణం కంటే 11 శాతం తక్కువగా నమోదయ్యాయి. వర్షాభావం తో వచ్చే పంటపై కూడా ఆందోళన నెలకొంది. వాతావరణ హెచ్చరికలు కూడా ముందుగానే ఉన్నప్పటికీ.. మోడీ సర్కారు వ్యవహరించిన తీరే సరిగ్గా లేదు. సరఫరా నిర్వహణ, నిల్వల విషయంలో ఒక ప్రణాళిక, ధరల నియంత్రణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇథనాల్ విధానం ఎఫెక్ట్
దేశంలో మొక్కజన్న సాగు విస్తీర్ణం తగ్గడంతో ఇథనాల్ తయారీకి బియ్యం వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇథనాల్ కోసం ఆహార ధాన్యాలను వినియోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. ఇది బియ్యం ధరలపై మరింత ఒత్తిడిని తీసుకురావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుడి కంచంపై ద్రవ్యోల్బణం దెబ్బ
క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక ప్రకారం.. జులైలో శాకాహార భోజనం ఖర్చు ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగు శాతం, మాంసాహార భోజనం ఖర్చు 9 శాతం పెరిగింది. ఉల్లి ధరలు 20 శాతం, వంటనూనె ధరలు 11 శాతం, ఎల్పీజీ సిలిండర్ ధరలు 10 శాతం పెరిగాయి. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల పేరుతో కూడా కేంద్రం దేశ ప్రజలపై మరింత భారాన్ని మోపింది. వంట గ్యాస్ ధరలను పెంచింది. దీంతో ప్రజలు ఇప్పటికీ ఆ భారాన్ని మోస్తూ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కోడి కూర కూడా ఖరీదే
దేశంలో కోడి కూర కూడా ప్రియమైంది. బ్రాయిలర్ కోళ్ల ధరలు ఏడాదిలో 14 శాతం పెరగడంతో మాంసాహార భోజనం మరింత ఖరీదైంది. దాణా వ్యయం పెరగడం కూడా ఇందుకు కారణమని క్రిసిల్ స్పష్టం చేసింది.
ప్రజలపై భారమే.. పరిష్కారం ఎక్కడ
ఒకవైపు రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి అని మోడీ సర్కారు ప్రకటనలు చేస్తుండగా… మరోవైపు బియ్యం, వంటనూనె, ఉల్లి, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో దేశంలో సామాన్య కుటుంబాల జీవన వ్యయం మరింత భారంగా మారుతోంది. ఉత్పత్తి, నిల్వలు, సరఫరా, ధరల నియంత్రణ మధ్య సమన్వయం లోపిస్తోందనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ప్రకటిస్తున్న రికార్డు గణాంకాల కంటే.. మార్కెట్‌లో వినియోగదారులు చెల్లిస్తున్న పెరిగిన ధరలే వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బియ్యం ధరలకు రెక్కలు
సోనా మసూరి, పొన్ని, మసూరి వంటి ప్రీమియం రకాల ధరలు గత కొన్ని వారాల్లో 10-13 శాతం వరకు పెరిగాయి. స్వర్ణ బియ్యం, ఎక్స్-మిల్ ధర కిలోకు రూ.30 నుంచి రూ.34కు చేరింది. సరఫరా తగ్గిపోవడం, కొత్త ఖరీఫ్ పంట ఇంకా మార్కెట్‌కు రాకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు, మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.



