Thursday, August 13, 2026
E-PAPER
Homeఆటలు31 జిల్లాల్లో క్రికెట్‌ సదుపాయాలు

31 జిల్లాల్లో క్రికెట్‌ సదుపాయాలు

- Advertisement -

జోనల్‌ అకాడమీలు, టీ20 టోర్నమెంట్లు
డీసీఐడీసీ చైర్మెన్‌ శేషు నారాయణ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌ :

తెలంగాణ వ్యాప్తంగా క్రికెట్‌ అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు హైదరాబాద్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ ‌(హెచ్‌‌సీఏ) త్వరలోనే స్పష్టమైన రోడ్‌‌మ్యాప్‌ ‌తయారు చేస్తుందని జిల్లా క్రికెట్‌ ‌మౌలిక సదుపాయాల అభివృద్ది కమిటీ (డీసీఐడీసీ) చైర్మెన్‌ ‌శేషు నారాయణ తెలిపారు. కమిటీ సభ్యులు వెంకట్‌‌రావు, వెంకట్‌ రెడ్డి, రాజశేఖర్‌, రామకృష్ణలతో కలిసి శేషు నారాయణ బుధవారం ఉప్పల్‌ ‌స్టేడియంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘హైదరాబాద్‌,రంగారెడ్డి మినహా ఇతర 31 తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల కనీస సదుపాయాలు లేవు. కొత్త జిల్లాలకు సభ్యత్వం అంశం ఏకసభ్య కమిటీ పరిధిలో ఉంది. ఉమ్మడి ఎనిమిది జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో కనీస సదుపాయాలు, జోనల్‌ క్రికెట్‌ అకాడమీ, గ్రౌండ్‌, ఆఫీస్‌ ‌లేదా వసతి కోసం రెండస్తుల భవన నిర్మాణం చేపట్టాలనే ప్రణాళికతో కమిటీ ముందుకెళ్తుంది. ఇప్పటికే స్థలాలు, మౌలిక సదుపాయాలు ఉన్న జిల్లాలు సహా జిల్లాల్లో వీటి ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తింపు, సేకరణకు చేపట్టాల్సిన చర్యలు, అనంతరం సదుపాయాల కల్పనకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్‌ ‌రిపోర్టును ఏకసభ్య కమిటీ, అపెక్స్‌‌కౌన్సిల్‌‌కు అందజేస్తాం. ఈ ప్రక్రియ 7-8 వారాల్లో ముగిస్తుందని’ శేషు నారాయణ తెలిపారు. జిల్లాల్లో క్రికెట్‌కు సంబంధించిన అంశాలు, క్రీడాకారుల ఎంపిక, హెచ్‌‌సీఏ లీగ్‌‌లో ప్రాతినిథ్యం వంటి అంశాలను క్రికెట్‌ ఆపరేషన్స్‌ ‌చీఫ్‌ అంబటి రాయుడు సారథ్యంలోని క్రికెట్‌ ‌సలహా కమిటీ పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కొత్త జిల్లాల్లో జోనల్‌ ‌క్రికెట్‌ అకాడమీలు నెలకొల్పి.. టీ10 టోర్నమెంట్లతో ప్రతిభావంతులను గుర్తించేందుకు ఓ వేదిక తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శేషు నారాయణ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -