నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాతో జరుగుతున్న యుద్ధాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలిగే వరకు ఉద్దేశపూర్వకంగా పొడిగించే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కమాండర్ సీనియర్ సలహాదారు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడి చేయాలంటే ఎవరైనా భయపడేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
“ఈ యుద్ధాన్ని తదుపరి అధ్యక్ష పదవీకాలం వరకు పొడిగించి, శత్రువుకు నష్టం కలిగించడం ఒక మార్గం. దీనివల్ల ఇరాన్‌పై దాడి చేయాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసుకుంటారు” అని ఐఆర్జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు మహమ్మద్ రెజా నఖ్దీ ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం యుద్ధంలో తాము గెలుస్తున్నామని, అయితే తమ అంతిమ లక్ష్యం ఇంకా నెరవేరలేదని నఖ్దీ అన్నారు. ఈ ఘర్షణ వల్ల అమెరికాతో పోరాటంలో తమకు మరింత అనుభవం వస్తుందని, తాము భావించిన దానికంటే అమెరికా సైన్యం బలహీనంగా ఉందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయోగిస్తున్న క్షిపణుల కంటే ప్రతిరోజూ ఎక్కువ క్షిపణులను తయారు చేస్తున్నామని, యుద్ధం ఏళ్లపాటు కొనసాగినా ప్రయోగించగలమని ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ తమ క్షిపణుల నిల్వలు అయిపోతే, ఇరాన్ అమెరికాకు మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. “క్షిపణులు లేనప్పుడు మేము మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వేలాది ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నింటినీ సులభంగా నాశనం చేయవచ్చు” అని నఖ్దీ అన్నారు. అయితే ఆ ఆర్థిక లక్ష్యాలు ఏమిటో, వాటిపై ఎలా దాడి చేస్తారో ఆయన స్పష్టంగా వివరించలేదు.


