నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌కు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, విద్యావేత్త సంగం లక్ష్మీబాయి పేరుతో నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో, ఆ తర్వాత సమాజ సేవలో సంగం లక్ష్మీబాయి అందించిన నిరుపమాన సేవలు చరిత్రలో మరపురానివని వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నేలకు చెందిన వీరనారిగా, నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు.
స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అల్వాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప విద్యామంత్రిగా సేవలు అందించారని, మెదక్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారని వివరించారు. సైదాబాద్‌లో ‘ఇందిరా సేవా సదన్’ నెలకొల్పి వేలాది మంది పేద బాలికలకు ఆశ్రయం, విద్య అందించిన మహోన్నత వ్యక్తి ఆమె అని తెలిపారు.



