నవతెలంగాణ- హైదరాబాద్ : ముడిచమురు దిగుమతులు తగ్గించే పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 20 శాతం ఇథనాల్ కలిపిన ఇ-20 పెట్రోల్ విధానంతో వాహనదారులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇ-20 ఇంధన నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది.
రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం ఇ-20 ఇంధనం సురక్షితమని చెబుతున్నప్పటికీ.. రాయటర్స్ నివేదికతోపాటు ఆటోమొబైల్ సంస్థల ఫిర్యాదులు ఇందుకు భిన్నమైన అంశాలను వెల్లడిస్తున్నాయని సీపీఐ(ఎం) పేర్కొంది. దేశవ్యాప్తంగా సేకరించిన ఇంధన నమూనాల్లో క్లోరైడ్ పరిమితి 3 పీపీఎం ఉండాల్సి ఉండగా రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 400–500 పీపీఎంలకు పైగా నమోదైనట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తేమ శాతం ఏకంగా 13,000 పీపీఎం వరకు నమోదైనట్లు పేర్కొంది. ఇంధన నాణ్యతపై ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని తెలిపింది.
ఇ-20 ఇంధనం వినియోగంతో వాహనాల మైలేజీ తగ్గడం, ఇంజిన్ భాగాలపై ప్రభావం పడటం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని సీపీఐ(ఎం) తెలిపింది. ముఖ్యంగా ఇ-20కి పూర్తిస్థాయిలో అనుకూలంగా లేని పాత వాహనాల యజమానులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొంది. ఇ20 పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్‌తో సమానంగా ఉండటంతో మైలేజీ తగ్గినా వినియోగదారులకు ఎలాంటి ధర ప్రయోజనం లభించడం లేదని విమర్శించింది.
అదేవిధంగా దేశంలో పోషకాహార లోపం కొనసాగుతున్న సమయంలో ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి మళ్లించడం ఆహార భద్రతకు ముప్పుగా మారుతుందని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఎథనాల్ ఉత్పత్తి కోసం పంటల సరళిలో మార్పులు రావడం వ్యవసాయ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 20 శాతానికి మించి పెట్రోల్‌లో ఎథనాల్ కలపడాన్ని నిలిపివేయాలని, ఇ-20 ఇంధన నాణ్యతపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి ప్రజల ఆరోగ్యం, వాహనాల భద్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.



