Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంఎస్సీ, ఎస్టీలకు 70శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి : యూపీ సీఎంకు సీపీఐ(ఎం) ఎంపి లేఖ

ఎస్సీ, ఎస్టీలకు 70శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి : యూపీ సీఎంకు సీపీఐ(ఎం) ఎంపి లేఖ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: యూపీలోని నాలుగు మెడికల్‌ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్న 70 శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని పరిరక్షించి, పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీ కె.రాధాకృష్ణన్‌ కోరారు. ప్రత్యేక రిజర్వేషన్‌ సదుపాయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. కన్నౌజ్‌, జలౌన్‌, అంబేద్కర్‌ నగర్‌, సహారన్‌పూర్‌లోని నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 70 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌’ (ఎస్‌సీపీ), ‘ట్రైబల్‌ సబ్‌-ప్లాన్‌’ (టీఎస్‌పీ) కింద నిధులతో ఈ నాలుగు వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారని రాధాకృష్ణన్‌ తెలిపారు. అలాంటి కళాశాలల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ సదుపాయాన్ని ఉపసంహరించుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యేక రిజర్వేషన్ల తొలగింపునకు యూపీ ప్రభుత్వం అలహాబాద్‌ హైకోర్టులో మద్దతు తెలిపిందని రాధాకృష్ణన్‌ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశం ఈ కళాశాలల్లో అమలవుతున్న ప్రత్యేక రిజర్వేషన్‌ విధానంపై ప్రభావం చూపిందని అన్నారు. 70 శాతం రిజర్వేషన్‌ కొనసాగింపుపై అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తన వైఖరిని పునఃపరిశీలించి, 70 శాతం రిజర్వేషన్‌ను పరిరక్షించేందుకు, పునరుద్ధరించేందుకు చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

వైద్య విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రిజర్వేషన్‌ను పరిరక్షించేందుకు కేరళ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. యూపీ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబించి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సానుకూల చర్యలకు సంబంధించిన రాజ్యాంగ సూత్రాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి న్యాయపరమైన పరిశీలనలో ఉన్నందున, ప్రస్తుత రిజర్వేషన్‌ విధానాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -