Monday, August 17, 2026
E-PAPER
Homeదర్వాజఅంతర్లీనం – అంతరంగ ఆవేదనలకు అక్షర రూపం

అంతర్లీనం – అంతరంగ ఆవేదనలకు అక్షర రూపం

- Advertisement -

కవిత్వం అంటే కేవలం పదాల కూర్పు కాదు, మనసు మోసే భారాన్ని అక్షరాల్లో ఆవిష్కరించే ఆత్మయజ్ఞం. ఆ కోణంలో చూస్తే డా. మామిడాల శైలజ గారి “అంతర్లీనం” కవితా సంపుటి సాధారణ కవితల సంకలనం కాదు. అది ఒక స్త్రీ హృదయపు లోతుల్లోంచి ఉబికివచ్చిన అనుభూతుల ప్రవాహం, సమాజాన్ని ప్రశ్నించే చైతన్య స్వరం, జీవితాన్ని అర్థం చేసుకునే ఆత్మాన్వేషణ.
వంద కవితలతో రూపుదిద్దుకున్న ఈ సంపుటి ఒకే అంశం చుట్టూ తిరిగే కవిత్వం కాదు. స్త్రీ జీవితం, మాతృత్వం, వివక్ష, కుటుంబ సంబంధాలు, సామాజిక వైరుధ్యాలు, రైతు జీవనం, పుస్తకాల ప్రాముఖ్యం, జ్ఞాపకాల బాధ, తాత్విక చింతన, ఆత్మగౌరవం వంటి అనేక కోణాలను స్పృశిస్తూ సాగుతుంది. ఈ సంపుటిలో అత్యంత బలంగా వినిపించేది స్త్రీ స్వరం. సమాజంలో ఆమె ఎదుర్కొనే అవమానాలు, అన్యాయాలు, అంతరంగ సంఘర్షణలు పాఠకుడి మనసులో ప్రశ్నలుగా నిలుస్తాయి. నెలసరి, గర్భధారణ, ప్రసవ వేదన వంటి అంశాలను కవయిత్రి ఎటువంటి సంకోచం లేకుండా సామాజిక చర్చలోకి తీసుకువచ్చిన తీరు ప్రశంసనీయం.

“అధోగమనం” కవితలో స్త్రీపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తూ కవయిత్రి ఇలా అంటారు.
“సృష్టి అంకురబీజాన్ని/ మూడునాళ్ల ముట్టు పేరుతో/ మూలన కూర్చోబెట్టినప్పుడే/ నీ అభివృద్ధిలోని డొల్లతనం తేటతెల్లమైంది.”
ఆధునికతను గొప్పగా చెప్పుకునే సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢాచారాలపై ఇది పదునైన ప్రశ్న.
ఈ సంపుటిలో తల్లిపై రాసిన కవితలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. “దర్పణం”, “నిష్కృతి”, “దుస్సాధ్యం” వంటి కవితల్లో తల్లిని కేవలం ప్రేమ ప్రతిరూపంగా కాకుండా త్యాగానికి, సహనానికి, ఆత్మార్పణానికి ప్రతీకగా ఆవిష్కరించారు.
“నిష్కృతి” కవితలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంతానాన్ని ప్రశ్నిస్తూ కవయిత్రి అడిగిన ప్రశ్న ప్రతి పాఠకుడి మనసును కదిలిస్తుంది.
“నా కాయానికి కారణమైన/ నీ పోషణ కోసం అతి హేయంగా/ పంపకాలు చేసుకుంటున్న/ ఈ సంతానానికి ఉంటుందా తల్లీ/ ఇక నిష్కృతి?”
అలాగే “దుస్సాధ్యం” కవితలో తల్లి గొప్పతనాన్ని ఇలా కీర్తించారు.
“వాత్సల్యం జీవలక్షణమైన/ నీ గొప్పతనాన్ని కీర్తించ/ ఆ చతుర్ముఖ బ్రహ్మకు సాధ్యం కాదు!”
“దర్పణం” కవితలో తల్లిని ఉద్దేశించి చెప్పిన ఈ పంక్తులు హృదయాన్ని తాకుతాయి.
“నిన్ను నువ్వు అర్పించుకుంటూ/ నా ఎదుగుదలకు దర్పణం అయ్యావు!/
లోకం మొత్తం నీ కళ్లతోనే చూపించావు!”
ఈ సంపుటి ప్రత్యేకత కేవలం వస్తువులోనే కాదు; శీర్షికల ఎంపికలో కూడా కనిపిస్తుంది. “నెత్తుటి గాయం”, “వెంటాడే జ్ఞాపకాలు”, “చీకటి మడుగు” వంటి కవితల్లో వ్యక్తిగత వేదన సామూహిక అనుభూతిగా రూపాంతరం చెందుతుంది. గాయాలను దాచుకోకుండా వాటిని అక్షరాలుగా మలచిన కవయిత్రి నిజాయితీ పాఠకుడిని కవితలో భాగస్వామిని చేస్తుంది.
“నెత్తుటి గాయం” కవితలోని ఈ పంక్తులు మనసును భారంగా మారుస్తాయి.
“ఏ క్షణమైతే నేను నా పెదవులపైకి/ చిన్న నవ్వుకు ఆహ్వానం పలుకుతానో/ మరుక్షణమే నేనున్నానంటూ/ నెత్తుటి గాయాల గతం/
నన్ను ఆపాదమస్తకం కమ్మేసుకుంటుంది!”
ఇది ఒక్క కవయిత్రి బాధ మాత్రమే కాదు, గత గాయాల బరువుతో జీవించే ప్రతి మనిషి అంతరంగ స్వరం.
స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే కవిత “సమఉజ్జీ”. అందులోని ఈ పంక్తులు నేటి మహిళా చైతన్యానికి ప్రతిధ్వనుల్లా వినిపిస్తాయి.
“ఆకాశంలో అర్థభాగంగా/ న్యాయమైన నా స్థానం/ దక్కితే చాలు ఇకపైన!”
ఈ సంపుటిలో కవయిత్రి కేవలం బాధనే కాదు, పోరాట స్ఫూర్తిని కూడా నింపారు. “విలంబం” కవితలో యువతకు మార్గదర్శకంగా నిలిచే సందేశాన్ని అందించారు.
“అంతర్లీనమైన శక్తులను/ వెలికి తీసి అలుపెరుగని వీరుడిలా పోరాడు/ నుసి అంటని వజ్రంలా ప్రకాశించు!”
శైలజ గారి భాష క్లిష్టతకు దూరంగా ఉంటుంది. భావోద్వేగానికి పదునుంటుంది. అలంకారాల ఆర్భాటం కన్నా అనుభూతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ కవితలు చదివిన తర్వాత గుర్తుండేది పదాలు కాదు. వాటి వెనుక దాగి ఉన్న బాధ, ప్రేమ, ఆవేదన, ఆశ.
సరళమైన భాష, భావసాంద్రత, ఆలోచింపజేసే వస్తువు, హృదయాన్ని కదిలించే అభివ్యక్తి. ఈ నాలుగు గుణాల సమ్మేళనమే “అంతర్లీనం”. ఈ కవితా సంపుటిని చదివిన తర్వాత మనం కవితలను మాత్రమే కాదు, ఒక హృదయ స్పందనను వింటాం. ఒక స్త్రీ ఆత్మగాథను అనుభవిస్తాం. ఒక సమాజపు ప్రతిబింబాన్ని దర్శిస్తాం.
“అంతర్లీనం” కేవలం కవితా సంపుటి మాత్రమే కాదు. స్త్రీ ఆవేదనకు అక్షర రూపం, మాతృత్వానికి మంగళహారతి, మానవ సంబంధాలకు దర్పణం, అంతరంగ సంఘర్షణలకు ప్రతిధ్వని, జీవితానికి తాత్విక వ్యాఖ్యానం.
కొన్ని కవితలు చదివిస్తాయి… కొన్ని కవితలు ఆలోచింపజేస్తాయి… మరికొన్ని కవితలు మన అంతరంగంలోకి చొచ్చుకుపోయి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. డా. మామిడాల శైలజ గారి “అంతర్లీనం” అలాంటి అరుదైన కవితా సంపుటి.
ఇది చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు. చదివిన తర్వాత కూడా మన ఆలోచనల్లో అలజడి రేపుతూ, హృదయపు లోతుల్లో ప్రతిధ్వనిస్తూ, తరచూ మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే అనుభూతుల సమాహారం. పుస్తకం పూర్తయినా, దాని భావాలు మాత్రం పాఠకుడి అంతరంగంలో చాలా కాలం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఎన్. లహరి, 9885535506

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -