మీరు కొనకుంటే
మా బతుకులు ఆగమైతయని
ఎవుసాలు కూలిపోతయని
ఊళ్ళకూల్లు
కొంగలమందలా ఎగిరిపోతాయని
మార్కెట్ ముందు
దాన్యం కుప్పలను చూపిస్తూ
లీడర్లతో మోరవెట్టుకుంటున్నయి ఎడ్లు
మోరవెట్టి గోస వడుతున్నయి
మా చెమట రాసులు కొనకుంటే
ఆకలి దేశమని చెడ్డ పేరు వస్తందని
పుండుపుండైన మెడలను చూపిస్తూ
గొడగొడా ఏడుస్తున్నయి
ఉల్లారిన డొక్కలను నాక్కుంటూ దుఃఖిస్తున్నయి
మీరు కొనక పోతే చావు తొందర పెడుతుందని
ఓపిక చచ్చిపోతున్నదని
కారుతున్న శోకాన్ని నాలుకతో చప్పరిస్తూ
తలవంచి వేడుకుంటున్నయి.
ఆవును సాదే అన్నలు, కొడుకులు పోతే
తల్లి గతి ఏమవుతుందని
మాకు కాటిదారే కాయమని
ఇదేనా మన ధర్మం అని
అరిగిన గిట్టల్ని చూపిస్తూ
మోకాళ్ళు వంచి వేడుకుంటున్నాయి
కడుపు నింపే అన్నం గింజలు
అచానక్ వానకు
మోరి కాలువలో ఏడుస్తూ ఎల్లిపోతుంటే
పానం లిల్లులీల్లయితున్నది
ఆయుధాలు కొంటారు
రాడార్లు, రాకెట్లు, డ్రోన్లను కొంటారు
ఓట్లను కూడా కొంటారు
కానీ
మా కష్టాన్ని చెమటకుప్పలని ఎందుకు కొనరని
గోసగోసగా చూస్తున్నయి
అన్నంపెట్టే అరకని, బతుకు నిచ్చే భూమిని
పట్టిచ్చుకోని సర్కారు నూకలు
ఎక్కువ కాలముండయని
నాగళ్ళు చేనునేకాదు
మీ గద్దెలనూ దున్నెస్తాయని
ఎర్రబడ్డ కండ్లతో హెచ్చరిస్తున్నాయి
అప్పుడే మీరు మా కండ్ల లీల్లల్ల
కొట్టుకు పోతారని
మరీ మరీ గుర్తుచేస్తున్నయి.
డా. ఉదారి నారాయణ, 9441513666
ఎడ్ల దుఃఖం
- Advertisement -
- Advertisement -



