వాషింగ్టన్ : వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టడంతో అమెరికాలో ఎక్కడ చూసినా అలజడి కన్పిస్తోంది. కొందరు దేశాన్ని వదిలిపోగా మరికొందరు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో పుట్టబోయే వారిని దత్తత ఇవ్వాలని అనుకుంటున్నారు. నిర్బంధాలు, బహిష్కరణలు ఎదురవుతున్నప్పటికీ కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులకు సంరక్షకులను నియమిస్తున్నారు. మరికొందరు ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే మానేసి ఇరుగుపొరుగు వారి పైన, చర్చిల పైన ఆధారపడుతూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నం అనేక మందిని కలవరపెడుతోంది. దీంతో కడుపులోని బిడ్డను దత్తత ఇవ్వాలనే ఆలోచన వారిలో మొదలవుతోంది. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఉత్తర్వును పౌర హక్కుల సంఘాలు న్యాయస్థానాలలో సవాలు చేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణ జన్మహక్కు పౌరసత్వానికి గ్యారంటీ ఇస్తోందని సుప్రీంకోర్టు జూన్ 30 తీర్పు చెప్పింది.
పౌరసత్వం లేని చాలా మంది తల్లిదండ్రులకు అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు దానంతట అదే లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని న్యాయస్థానం అడ్డుకుంది. సుప్రీంకోర్టు తీర్పు అనేకమంది తల్లిదండ్రులకు ఊరట కలిగించింది. కోర్టు తీర్పు ప్రకారం ఒకవేళ తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించినప్పటికీ వారిని పెంచడానికి తాము అందుబాటులో ఉంటామా అన్న భయం చాలా మందిలో కలుగుతోంది. ఒకవేళ తమను దేశం నుంచి బహిష్కరిస్తే పిల్లల బాగోగులు చూడడానికి వారికి తాత్కాలిక సంరక్షకులను నియమిస్తూ చట్టపరమైన పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలస నియంత్రణ చర్యల కారణంగా నవజాత శిశువుల నుంచి కౌమార దశకు చేరుకున్న వారి వరకూ అమెరికా పౌరసత్వం ఉన్న వంద మందికి పైగా పిల్లలు తమ తల్లిదండ్రులను దూరం చేసుకోవాల్సి వచ్చింది. కొందరిని బంధువులు, స్నేహితులు చేరదీయగా మరికొందరు సంరక్షణ గృహాలలో చేరారు.
వలస నియంత్రణ చర్యలతో అమెరికాలో అలజడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



