నిందితుడు సహా ఆరుగురు మృతి
వర్జీనియా యూనివర్సిటీలోనూ కాల్పులు
వాషింగ్టన్ : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. మిచిగన్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నిందితుడు సహా ఆరుగురు మరణించారు. మృతుల్లో 16 ఏండ్ల బాలుడు సహా నలుగురు పెద్దలు ఉన్నారు. మరో 13 ఏండ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. మిచిగన్ పోలీసుల కథనం ప్రకారం… డెట్రాయిట్‌కు సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్టు సమాచారం అందింది. తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ ఇంట్లో 16 ఏండ్ల బాలుడు, 45 ఏండ్ల వ్యక్తి, 40 ఏండ్ల మహిళ మృతదేహాలను గుర్తించారు. అదే ఇంట్లో 13 ఏండ్ల బాలిక కూడా తుపాకీ గాయాలతో కనిపించింది. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు చాడ్ హిక్‌మన్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మరో ఇంట్లో కాల్పులకు పాల్పడి ఒకరిని హత్య చేశాడు. అదే సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతంలో 29 ఏండ్ల మహిళ మృతదేహం లభించింది. ఆమె మృతదేహం పక్కనే అనుమానితుడు చాడ్ హిక్‌మన్ మృతదేహం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో మృతిచెందిన వారందరూ తుపాకీ గాయాల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. హిక్‌మన్ ఎలా మృతి చెందాడు..? కాల్పులకు కారణమేంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వర్జీనియా యూనివర్సిటీలోనూ కాల్పులు
అమెరికా వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రెసిడెన్స్ హాళ్ల సమీపంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఓ యూనివర్సిటీ విద్యార్థి ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపస్‌లో లాక్‌డౌన్ విధించి, అనంతరం దాన్ని ఎత్తివేశారు. క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
గవర్నర్ విట్మర్ స్పందన
ఈ ఘటనపై గవర్నర్ గ్రెచెన్ విట్మర్ స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
బాలికను వేధించిన కేసులో జైలుకి!
కోర్టు రికార్డుల ప్రకారం, చాడ్ హిక్‌మన్‌పై గతంలోనూ కేసు నమోదైంది. ఓ బాలికను వేధించిన కేసులో 2024లో అతడికి ఏడాది జైలు శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు. తాజా కాల్పుల ఘటనకు ఆ కేసుకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందా అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయలేదు. “ఈ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇందులో పాల్గొన్న దర్యాప్తు అధికారులకు కూడా ఇది సవాలుతో కూడుకున్న పరిస్థితి” అని మిచిగాన్ స్టేట్ పోలీస్ లెఫ్టినెంట్ యాష్లే మిల్లర్ తెలిపారు.



