Monday, August 17, 2026
E-PAPER
Homeజాతీయంరైల్వే శాఖ నిర్లక్ష్యం!

రైల్వే శాఖ నిర్లక్ష్యం!

- Advertisement -

ఎనిమిది స్టేషన్లలోని తాగునీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా
179 స్టేషన్లలో రసాయన పరీక్షలే లేవు
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం!
నీటి నాణ్యత ప్రమాణాల అమలులో
తీవ్ర లోపాలను ఎత్తిచూపిన కాగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లలోని వాటర్ కూలర్లు, కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్టు కంప్ట్రోలర్‌ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) నిర్వహించిన ఆడిట్‌లో బయటపడింది. పలు స్టేషన్లలో నీటి నాణ్యతను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షించకపోవడం, పరీక్షలు నిర్ణీత వ్యవధిలో నిర్వహించకపోవడం వంటి తీవ్రమైన లోపాలను కాగ్ ఎత్తిచూపింది.

ఎనిమిది స్టేషన్లలో ‘ఈ–కోలి’
‘భారతీయ రైల్వేల్లో నాన్–సబర్బన్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుధ్యం’పై కాగ్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 49 రైల్వే స్టేషన్లలోని వాటర్ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా ఎనిమిది స్టేషన్లలో ఈ–కోలి బ్యాక్టీరియా గుర్తించారు. ఈ స్టేషన్లలో దక్షిణ రైల్వే పరిధిలోని కోయంబత్తూరు, పాలక్కడ్‌ జంక్షన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, సెంట్రల్ రైల్వే పరిధిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భివాండి రోడ్, కల్యాణ్, లోణావాలా, ఈస్టర్న్ రైల్వే పరిధిలోని మధుపూర్ ఉన్నాయి.

నీటి పరీక్షల్లోనూ నిర్లక్ష్యం
2022–23లో ఎనిమిది రైల్వే జోన్ల పరిధిలోని 49 స్టేషన్లలో, 2023–24లో తొమ్మిది జోన్ల పరిధిలోని 56 స్టేషన్లలో ప్లాట్‌ఫాం కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో టోటల్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా, ఈ–కోలి వంటి కాలుష్య కారకాలు ఉన్నట్టు ఆడిట్‌లో తేలింది. 2022–23లో నాలుగు రైల్వే జోన్లకు చెందిన ఎనిమిది స్టేషన్లలో, 2023–24లో ఐదు జోన్లకు చెందిన 11 స్టేషన్లలో టోటల్ కోలిఫార్మ్‌లకు అదనంగా నిర్వహించాల్సిన బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు సంతృప్తికరంగా లేవని కాగ్ గుర్తించింది.

179 స్టేషన్లలో రసాయన పరీక్షలే లేవు
తాగునీటి నాణ్యతపై పర్యవేక్షణలో మరో తీవ్రమైన లోపాన్ని కూడా కాగ్ బయటపెట్టింది. 11 రైల్వే జోన్ల పరిధిలోని 179 స్టేషన్లలో హెల్త్ ఇన్‌స్పెక్టర్లు తాగునీటికి రసాయన పరీక్షలు నిర్వహించలేదు. మరో ఆరు జోన్ల పరిధిలోని 77 స్టేషన్లలో పరీక్షలు నిర్దేశించిన వ్యవధిలో జరగలేదు. నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్లలో తాగునీటిని ఏడాదికి కనీసం రెండుసార్లు పరీక్షించాలి. అయితే అనేక ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు కాలేదని కాగ్ తేల్చింది.

క్లోరిన్‌లోనూ హెచ్చుతగ్గులు
నీటిలో ఉండాల్సిన క్లోరిన్ స్థాయిల్లోనూ లోపాలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల క్లోరిన్ స్థాయి తక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. మొత్తం కోలిఫార్మ్ బ్యాక్టీరియా, ఈ–కోలి ఉనికితోపాటు పలు కీలక ప్రమాణాల్లో లోపాలు కనిపించాయని కాగ్ పేర్కొంది. అంతేకాకుండా, ‘యూనిఫాం డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ప్రొటోకాల్’ ప్రకారం పరీక్షించాల్సిన అనేక అంశాలను పలు స్టేషన్లలో పరీక్షించలేదని ఆడిట్ స్పష్టం చేసింది.

చర్యలు తీసుకున్నామన్న రైల్వే శాఖ
కాగ్ లేవనెత్తిన అంశాలపై గతేడాది సెప్టెంబరులో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ… తాగునీటి పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలు, అసంతృప్తికరమైన పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. అయితే వివిధ ప్రాంతాల్లో పదేపదే అసంతృప్తికరమైన ఫలితాలు రావడం చూస్తే ప్రయాణికులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు రైల్వే శాఖ మరింత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాగ్ స్పష్టం చేసింది.

పారిశుధ్యంపైనా అసంతృప్తి
రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, పారిశుధ్యం కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ పలు స్టేషన్లలో పారిశుధ్య పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవని కాగ్ గుర్తించింది. ప్రయాణికుల ప్రాథమిక సౌకర్యాల్లో అత్యంత కీలకమైన తాగునీటి విషయంలోనే నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడం రైల్వే శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

కాగ్ కీలక సూచనలు
రైల్వే శాఖ నిర్దేశించిన ప్రొటోకాల్స్ ప్రకారం నీటి సరఫరా వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కాగ్ సూచించింది. తాగునీటి నాణ్యతను నిర్ణయించేందుకు యూనిఫాం డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ప్రొటోకాల్‌లోని అన్ని ప్రమాణాల ప్రకారం సమగ్ర పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో భారీగా ఆదాయం సమీకరించే రైల్వే శాఖ.. కనీసం సురక్షితమైన తాగునీటిని అందించడంలోనైనా నిర్లక్ష్యానికి తావివ్వకూడదనే విషయాన్ని ఈ కాగ్ నివేదిక మరోసారి గుర్తుచేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -