ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగు సరికాదు
సాగర్ పరిధిలో మెట్ట పంటలపై మొగ్గు చూపాలి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఆల్దాస్ జానయ్య
పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచన
పంటల మార్పిడి తప్పనిసరి : జూలకంటి రంగారెడ్డి
‘వ్యవసాయ రంగంలో ఎల్‌నినో ప్రభావం’పై నల్లగొండలో సెమినార్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి పప్పుదినుసులు, నూనెగింజలు, చిరు ధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాల యం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య సూచించారు. ఆదివారం నల్లగొండలోని పట్టణంలోని ఓ హోటల్‌లో ‘వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం-రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గాలు’పై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై ఆశలు పెట్టుకుని కొత్తగా వరినాట్లు వేయడం సరికాదని సూచించారు. ఇప్పటికే నార్లు పోసిన రైతులు ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించాలని కోరారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 10–12 శాతం లోటు నమోదైందని, ఎనిమిది జిల్లాల్లో లోటు మైనస్ 30 శాతం వరకు చేరిందని తెలిపారు. 30 ఏండ్లలో సుమారు ఆరు సంవత్సరాలు ఎల్‌నినోను ఎదుర్కొన్నామని, ఇది కొత్త పరిణామం కాదని అన్నారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం శుభపరిణామమన్నారు.
వర్షాలు తగ్గాయని రైతులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్‌లో ఈసారి నీరు నిండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, రెండు నెలలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నీటిపారుదల శాఖ రైతులను అప్రమత్తం చేస్తున్నాయని వీసీ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడంతో పాటు విత్తన మేళాలు కూడా నిర్వహించినట్టు చెప్పారు. అయినప్పటికీ సాగర్ నీళ్లు వస్తాయన్న ఆశతో కొంతమంది రైతులు వరి నార్లు పోసుకున్నారని, బావులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో కొంతమేర పంటను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం సాగర్ నీటిపైనే ఆధారపడి మాత్రం వరి సాగు చేయొద్దని తెలిపారు. సెప్టెంబర్ వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.
పంటల మార్పిడి తప్పనిసరి : జూలకంటి రంగారెడ్డి
రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని అఖిల భారత కిసాన్‌సభ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై పోరాటాలు కొనసాగుతున్నాయని, రైతాంగాన్ని ఐక్యంగా కదిలించి హక్కుల సాధనకు ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నల్లగొండలోనే రైతు మహాసభకు ప్రత్యేకత
అఖిల భారత కిసాన్‌సభ 36వ మహాసభను నల్లగొండలో జరపాలని అనుకోవడం చారిత్రాత్మక నిర్ణయమని జూలకంటి తెలిపారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ కేంద్రంగా నిలిచిం దని, వేలాదిమంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన చారిత్రక ప్రాంతమని గుర్తుచే శారు. ఆ పోరాట ఫలితంగా భూ పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది రైతు ప్రతినిధులు నాలుగు రోజులపాటు మహాసభలో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 15న లక్ష మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంటికో వ్యక్తి, గ్రామానికో బస్సు లేదా రెండు ట్రాక్టర్లు కదిలేలా రైతులను సమీకరించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమా రు 1.30లక్షల రైతు కుటుంబాలను నేరుగా కలవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబా లను సంప్రదించనున్నట్టు వెల్లడిం చారు. మహాసభకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర సరుకులతో పాటు ఆర్థిక సహకారాన్ని రైతులు అందించాలని కోరారు. ఈ సెమినార్‌లో విశ్రాంత ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.



