భద్రత లేక కోట్లాది మంది ఉద్యోగాలకు దూరం
ఆర్థిక వ్యవస్థకు రూ.4.6 లక్షల కోట్ల నష్టం!..మహిళల కార్మిక భాగస్వామ్యంపై ప్రభావం
నినాదాలకే పరిమితమైన కేంద్రం విధానాలు
దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ ఒక ప్రధాన సమస్యగానే ఉంది. ‘భారత్ మాతా కీ జై’, ‘నారీ శక్తి’ అంటూ నినాదాలతో ప్రచారాలు చేసుకుంటున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. వారి భద్రతకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. భద్రతాలేమితో మహిళలు ఉద్యోగాలకు దూరం కావడం, ఉత్పాదకత తగ్గడం, ఆరోగ్య వ్యవయాలు పెరగడం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడటం ద్వారా ఏటా లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం దేశానికి జరుగుతోంది. ఈ సమస్యను అభివృద్ధి చర్చల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ… మోడీ ప్రభుత్వ విధానాల్లో దీనికి తగిన ప్రాధాన్యం దక్కుతోందా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.
న్యూఢిల్లీ : భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా చెబుతున్నప్పటికీ.. దేశంలో మహిళలపై కొనసాగుతున్న హింస దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ మూల్యాన్ని మిగుల్చుతోంది. మహిళలపై హింస, ముఖ్యంగా కుటుంబంలో జరిగే హింస, వారి ఉద్యోగ అవకాశాలను, ఆదా యాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దెబ్బ తీస్తోంది. జాతీయ మీడియాలో వచ్చిన విశ్లేషణ ప్రకారం. మహిళలపై హింస కారణంగా మహిళ ల కార్మిక భాగస్వామ్యం తగ్గితే రూ.2.3 లక్షల కోట్ల నుంచి రూ.4.6 లక్షల కోట్ల వరకు ఉత్పత్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇది భారత జీడీపీలో సుమారు 0.8 శాతం నుంచి 1.6 శాతం వరకు ఉంటుంది. ఆరోగ్య వ్యయాలు, ఉద్యోగం లో ఉన్న మహిళల ఉత్పాదకత తగ్గడం, తరతరాల పై పడే ప్రభావం వంటి అంశాలను కూడా కలిపితే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రతి 71 సెకన్లకు ఒక కేసు!
జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదికలో మహిళలపై నేరాలకు సంబంధించి 4,41,534 కేసులు నమోదయ్యా యి. అంటే సగటున ప్రతి 71 సెకన్లకు ఒక కేసు నమోదైనట్టుగా ప్రభుత్వ రికార్డులు చూపిస్తున్నా యి. 2014తో పోలిస్తే నమోదైన కేసులు 30 శాతానికి పైగా పెరిగాయి. భర్త, ఆయన బంధువుల చేతిలో మహిళలపై జరిగే క్రూరత్వం నమోదైన నేరాల్లో అతిపెద్దదిగా ఉంది. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ఎఫ్ఐఆర్లు మాత్రమే మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవ హింస మొత్తా న్ని ప్రతిబింబించవు. మహిళలపై జరుగుతున్న అనేక నేరాలకు సంబంధించిన ఘటనలు ఫిర్యాదు దశకు కూడా రావడం లేదు. నమోదైన కేసుల సంఖ్యను మాత్రమే ఆధారంగా చేసుకుని సమస్య తీవ్రతను అంచనా వేయడం వాస్తవ పరిస్థితిని తక్కువగా చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
గృహ హింస.. ఉద్యోగానికి దూరం
ఇంట్లో హింస (గృహ హింస) ఎదుర్కొనే మహిళలకు ఉద్యోగం చేయడం, ఉద్యోగంలో కొనసాగడం, ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడం మరింత కష్టమవుతుంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలపై చేసిన విశ్లేషణలో పట్టణ ప్రాంతాల్లో భర్త లేదా భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటున్న మహిళల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహిళలు ఉద్యోగాలు చేయడం లేదా పనిలో పాల్గొనడం తక్కువగా ఉంది. ఉదాహరణకు.. బీహార్లో పట్టణ ప్రాంతాల్లో వివాహిత మహిళల్లో భాగస్వామి హింసను ఎదుర్కొంటున్న వారి శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ మహిళల కార్మిక భాగస్వామ్యం కేవలం 15.3 శాతంగా ఉంది.
కాగితాలపై పెరిగిన ఉపాధి
భారత్లో మహిళల కార్మిక భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాల్లో పెరిగినట్టు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మోడీ ప్రభుత్వ ‘వికసిత్ భారత్’ లక్ష్యాలపై ప్రశ్న లేవనెత్తుతోంది. ఆర్థిక వృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం కాదు.. దేశంలోని సగం జనాభా సురక్షతంగా, స్వతంత్రంగా, గౌరవంగా ఉద్యోగాల్లో ఉండే పరిస్థితులు ఏర్పడినప్పుడే ఆ వృద్ధి సమగ్రంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
పిల్లల భవిష్యత్తుపైనా ప్రభావం
మహిళలపై హింస ప్రభావం అక్కడితో ఆగదు. కుటుంబ హింస మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు, పిల్లల పోషణ, ఆరోగ్యం, చదువు, భవిష్యత్ ఉపాధి సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుంది. హింసతో కూడిన కుటుంబ వాతావరణంలో పెరిగే పిల్లల్లో పాఠశాలలు మానేయడం, బాల్య వివాహాలు, భవిష్యత్తులో తక్కువ కార్మిక భాగస్వామ్యం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మహిళల భద్రతతోనే ‘వికసిత్ భారత్’
మహిళలపై హింసను కేవలం నేరం, పోలీసింగ్, శిక్షల కోణంలో మాత్రమే చూడటం సరిపోదు. ఇది దేశ ఉత్పాదకత, ఉపాధి, ఆరోగ్యం, మానవ మూలధనం, ఆర్థిక వృద్ధికి సంబంధించిన సమస్య. మోడీ ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అని గొప్పగా ప్రచారాలు చేసుకుంటోంది. అయితే అసలు పరీక్ష మహిళల భద్రతేనని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలోని మహిళలు భయంలేకుండా ఇల్లు దాటి ఉద్యోగానికి వెళ్లగలరా? హింసకు గురైతే న్యాయం పొందగలరా? తమ సంపాదనపై స్వతంత్ర నిర్ణయం తీసుకోగలరా? వారి గృహ శ్రమకు ఆర్థిక విలువ గుర్తించబడుతుందా? అనే ప్రశ్నలకు మోడీ సర్కారు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మహిళల భద్రతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని చెప్తున్నారు.
భద్రతా భయం.. ఉద్యోగానికి దూరం
దేశంలో పని చేసే వయసున్న మహిళల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ.. భద్రతపై భయం అనేది వారిని ఉద్యోగాల్లోకి ప్రవేశించకుండా ఆపే ప్రధాన అడ్డంకుల్లో ఒకటిగా నిలిచింది. మహిళలు సురక్షితంగా ప్రయాణించగలిగే రవాణా, కార్యాలయాలు, వీధులు, నివాస ప్రాంతాలు లేకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం మాత్రమే సరిపోదని మేధావులు చెప్తున్నారు. పరిశోధకుల అంచనా ప్రకారం… మహిళలపై హింస, దాని భయం మహిళల కార్మిక భాగస్వామ్యాన్ని 5 నుంచి 10 శాతం పాయింట్లు తగ్గిస్తే, సురక్షితమైన పరిస్థితుల్లో మరో 2.3 కోట్ల నుంచి 4.6 కోట్ల మంది మహిళలు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వారి సగటు వార్షిక ఆదాయాన్ని సుమారు రూ.లక్షగా తీసుకుంటే… ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్న మొత్తం రూ.2.3 లక్షల కోట్ల నుంచి రూ.4.6 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.



